పవన్ ను కలిసిన షర్మిల.. అభినందనలు తెలిపిన జనసేన అధినేత!
అవును... కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు
By: Tupaki Desk | 18 Jan 2024 4:22 AM GMTకాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ప్రస్తుతం తమ కుమారుడి వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు! ఆ వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటూ.. అతిధులను ఆహ్వానించే పనుల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో షర్మిళ.. పవన్ కల్యాణ్ ను కలిశారు.
అవును... కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన షర్మిల.. ఆయనకు వివాహ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ప్రియా అట్లూరి గురించి పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం... తాజాగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా నియమితురాలైన వైఎస్ షర్మిలకు జనసేన అధినేత బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ లో వెల్లడించింది. "జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చిన వైఎస్ షర్మిల" అని రాస్తూ అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది.
కాగా... జనవరి 18న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్ మెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. అనంతరం... ఫిబ్రవరి 17న వీరిద్దరి వివాహం రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనుంది. అనంతరం జరగనున్న రిసెప్షన్ కార్యక్రమం కోసం వైఎస్ షర్మిల రాజకీయ ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.
ఇందులో భాగంగా... తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు శుభలేఖ అందించిన వైఎస్ షర్మిల.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ ను కలిసిన ఆమె... తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.