Begin typing your search above and press return to search.

రామోజీ రావు సేవలను కొనియాడిన షర్మిళ.. పిక్స్ వైరల్!

ఇందులో భాగంగా ఆర్.ఎఫ్.సీ కి స్వయంగా వెళ్లిన ఆమె.. రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 12:50 PM GMT
రామోజీ రావు సేవలను కొనియాడిన షర్మిళ.. పిక్స్  వైరల్!
X

రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా... రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటంవద్ద వైఎస్ షర్మిళ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీ సేవలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొనియాడారు!

అవును... రామోజీ గ్రూప్స్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుకు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆర్.ఎఫ్.సీ కి స్వయంగా వెళ్లిన ఆమె.. రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం రామోజీ సతీమణి రమాదేవితో పాటు ఆయన కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరీ సుమన్ లను పరామర్శించారు! ఆ తర్వాత రామోజీరావు కుటుంబ సభ్యులందరితోనూ కలిసి ప్రత్యేకంగా ఫోటో దిగారు షర్మిళ. ఈ సందర్భంగా మీడియా రంగంలో రామోజీరావు సేవలను గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి రామోజీరావుకి షర్మిళ తండ్రి వైఎస్సార్ కి ఉప్పూ నిప్పులా వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. స్వయంగా అసెంబ్లీలోనే వైఎస్సార్ ఈ విషయంపై పత్రిక పేరు చెప్పి తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఇదే సమయంలో వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు, షర్మిళ సోదరుడైన జగన్ తోనూ రామోజీ శతృత్వాన్ని కొనసాగించారనే విషయం జగన్ పలు మార్పు వెల్లడించారు!

ప్రధానంగా జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆయనకు వ్యతిరేకంగా రామోజీ మీడియా ద్వారా నిత్యం దుష్ప్రచారం చేస్తూ వచ్చేవారని.. తనకు చంద్రబాబు ఎంత శత్రువో, రామోజీ కూడా అంతే అన్నట్లుగా జగన్ పలు బహిరంగ సభల్లో ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు చేసిన పరిస్థితి.

కాగా... రామోజీరావు మరణం తర్వాత సోషల్‌ మీడియా వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తన సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఫిల్మ్‌ సిటీకి వెళ్లి మరీ నివాళులర్పించారు. ఏది ఏమైనా రామోజీకి వైఎస్ షర్మిల ప్రత్యేకంగా నివాళులర్పించడం ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది.