షర్మిలకు డిపాజిట్లు గల్లంతు...ఆ మీదట ?
మొత్తానికి చూస్తే ఈ ఎన్నికల్లో జగన్ అంచనా కడుతున్నట్లుగానే షర్మిల డిపాజిట్లు కోల్పోతే అది ఆమె రాజకీయ జీవితానికే కాదు వైఎస్సార్ కుటుంబానికే తీరని అప్రతిష్టగా మారబోతోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 30 April 2024 6:08 AM GMTవైఎస్సార్ పుట్టిన గడ్డ మీద ఆయన రక్తం పంచుకుని పుట్టిన తనయకు డిపాజిట్లు దక్కవా. అదే జరిగితే ఆ కుటుంబానికి ఎంత నామర్దా. ఎంత నామోషీ. అది ఆమె వరకూ పరిమితం అవుతుందా లేక వైఎస్సార్ కుటుంబం మీదనే ఆ మచ్చ పడుతుందా. అసలైన వైఎస్సార్ అభిమానులలో ఇవన్నీ చర్చలుగా ముందుకు వస్తున్నాయి.
వైఎస్సార్ కుటుంబం అంటే ఓటమి ఎరుగని ఫ్యామిలీ. అయితే అదంతా ఆయన బతికి ఉన్న రోజులలోనే. ఆయన మరణానంతరం కుటుంబం రెండుగా చీలిపోయింది. నాడు అన్నకు లక్ష్మణుడు లాంటి తమ్ముడిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్సార్ మరణానంతరం ఆయన సతీమణి సొంత వదిన మీదనే పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ విధంగా తొలి ఓటమి వివేకా రూపంలో వైఎస్సార్ ఫ్యామిలీకి దక్కింది.
ఇక 2014 ఎన్నికల వేళ వైఎస్సార్ ధర్మ పత్ని వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు ఎంపీగా పోటీ చేస్తారు. అమె ఏకంగా లక్ష ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇది వైఎస్సార్ ఫ్యామిలీకి లభించిన రెండవ ఓటమి.
ఆ తరువాత స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా వైసీపీ తరఫున కడప నుంచి పోటీ చేతే పూర్తి మెజారిటీ ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్ వల్ల ఓటమి పాలు అయ్యారు. ఇది ముచ్చటగా మూడవ ఓటమి వైఎస్సార్ కుటుంబానికి అని భావించాలి. ఇక నాలుగవ ఓటమి దారుణంగా ఉండబోతోందా. ఆ కుటుంబ రాజకీయ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చే విధంగా ఈ ఓటమి ఉండబోతోందా అంటే వైఎస్ జగన్ మాటలనే ప్రమాణంగా తీసుకుంటే మాత్రం కడప ఎంపీ సీటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు డిపాజిట్లు కూడా దక్కవు అని తేలుతోంది.
ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుపు ఆశలు సంగతి పక్కన పెడితే కనీసం గట్టి పోటీ ఇస్తే ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఎంతో కొంత హోప్ ఉంటుంది. కానీ ఆమెకు ఏకంగా డిపాజిట్లు గల్లంతు అయితే ఆమె రాజకీయ జీవితం పూర్తిగా మూసుకుపోయినట్లే అంటున్నారు. వైఎస్ వివేకా ఓటములు చూసినా ఆయన రాజకీయ జీవిత చరమాంకంలో అలా జరగడం తో ఆయనకు ఏమీ ఇబ్బంది లేకుండా పోయింది
ఇక విజయమ్మ సంగతి తీసుకుంటే ఆమె 2011లో జరిగిన పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత ఆమె ఓడారు. దాంతో ఆమెకు ముందు గెలుపు ఉంది ఓటమి తరువాత వచ్చింది. పైగా ఆమె పొలిటికల్ గా సీరియస్ గా ఉండాలని ఏమీ అనుకోలేదు. కానీ వైఎస్సార్ కుమార్తెగా తన రాజకీయ భవిష్యత్తుని అన్న జగన్ తో సమానంగా తీర్చిదిద్దుకుందామని భావిస్తున్న వారు షర్మిల.
ఆమెకు కూడా పెద్ద పదవుల మీద ఆశలు ఉన్నాయి. అయితే వాటికి తగినట్లుగా ఆమె వ్యూహాలు ఉన్నాయా అన్నదే చర్చ. ఆమెలో నిలకడలేని తనం, ఆవేశం పాళ్ళు తప్ప ఆలోచన లేకపోవడం వంటివి మైనస్ గా మారుతున్నాయని అంటున్నారు. రాజకీయాల్లో ఉండాల్సింది నిగ్రహం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే నైజం.
కానీ షర్మిల ఎందుకు పార్టీ పెట్టారో తెలియదు. ఆ పార్టీ ఆమె తెలంగాణాలో ఎందుకు పెట్టారో అంతకంటే తెలియదు. అక్కడ పోటీ చేయకుండా ఎందుకు కాంగ్రెస్ కి తెల్ల జెండా చూపించారో అది కూడా తెలియదు. అక్కడ పార్టీని పూర్తిగా చాప చుట్టేసి ఎన్నికలు మూడు నెలల వ్యవధిలో ఉన్నాయనగా ఏపీకి ఎందుకు షిఫ్ట్ అయ్యారో అంతకంటే తెలియదు.
పోనీ ఏపీలో కాంగ్రెస్ కి ప్రచారం చేస్తూ ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉన్నా ఎంతో కొంత మేలుగా ఉండేది. కానీ ఆమె పోటీకి దిగారు. అది కూడా అసెంబ్లీకి కాదు, ఏకంగా ఎంపీ సీటుకు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున కడపలో పోటీ చేయడం అంటే అది దుస్సాహసమే అవుతుంది. మొత్తానికి చూస్తే ఈ ఎన్నికల్లో జగన్ అంచనా కడుతున్నట్లుగానే షర్మిల డిపాజిట్లు కోల్పోతే అది ఆమె రాజకీయ జీవితానికే కాదు వైఎస్సార్ కుటుంబానికే తీరని అప్రతిష్టగా మారబోతోంది అని అంటున్నారు. ఇక ఆమె ఓడిన మీదట రాజకీయంగా ఆమెకు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అంటే అది పెద్ద ప్రశ్నగా మిగలబోతోంది.