Begin typing your search above and press return to search.

ష‌ర్మిల చేసుకున్న "రాజ‌కీయం"... ఫ్యూచ‌ర్ కొలాప్సేనా?

అయితే, వీరు ష‌ర్మిల‌కు ఓటేస్తారా? వేయ‌రా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అంతో ఇంతో ష‌ర్మిల గురించి అయితే.. చ‌ర్చించిన సంద‌ర్భా లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   28 Sep 2023 6:31 AM GMT
ష‌ర్మిల చేసుకున్న రాజ‌కీయం...  ఫ్యూచ‌ర్ కొలాప్సేనా?
X

తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని, రాజ‌న్న పాల‌నను ప్ర‌జ‌ల‌కు అందిస్తాన‌ని శ‌ప‌థాలు చేసిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఇప్పుడు ఆట‌లో అరిటిపండు అయిపోయారా? ఆమెను ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదా? ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాద‌యాత్ర‌, స‌ర్కారుపై దండెత్తిన విధానం అన్నీ కూడా.. కొలాప్సేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లే ఉంటాయ‌న్న నానుడికి ష‌ర్మిల‌, ఆమె పార్టీ ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు.

పార్టీ ప్రారంభించిన నాడు ఓ వ‌ర్గం ప్ర‌జలు, ముఖ్యంగా ఆరోగ్య శ్రీ వంటి ప‌థ‌కాల ద్వారా మేళ్లు పొందిన వారు అంతో ఇంతో ష‌ర్మిల వైపు నిల‌బ‌డ్డారు. ఆమె పాద‌యాత్ర చేసిన‌ప్పుడు , కేసీఆర్ స‌ర్కారుపై నిప్పు లు చెరిగిన‌ప్పుడు కూడా.. వీరి నుంచి వ్య‌తిరేక‌త రాని మాట వాస్త‌వం. అయితే, వీరు ష‌ర్మిల‌కు ఓటేస్తారా? వేయ‌రా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అంతో ఇంతో ష‌ర్మిల గురించి అయితే.. చ‌ర్చించిన సంద‌ర్భా లు ఉన్నాయి.

ఇదే ష‌ర్మిల‌కు ప్ల‌స్ అయింది. పార్టీలో ఎవ‌రూ చేర‌క‌పోయినా.. పార్టీ గురించి ఇత‌ర కీల‌క పార్టీలు ప‌ట్టించు కోక‌పోయినా.. ప‌రిణామాలు త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్నా.. ష‌ర్మిల పాద‌యాత్ర కొన‌సాగించారు.

ఇదే పంథాను ఆమె కొన‌సాగించి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. అయితే.. ఆమె ఎప్పుడైతే.. పార్టీని విలీనం చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారో.. ఇక అప్ప‌టి నుంచి డౌన్ ఫాల్ ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌నీసం ష‌ర్మిల గురించి ప‌ట్టించుకున్న మీడియా కానీ, ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు కానీ.. ఇప్పుడు ఆమెను పూర్తిగా మ‌రిచిపోయిన ప‌రిస్థితి నెల‌కొంది. రాజ‌కీయంగా ఆమె `గేమ్‌` ఆడుతున్నార‌ని.. ప్ర‌జ‌ల సెంటిమెంటును త‌న‌కు అనుకూలంగా మార్చుకుని.. రాజ‌కీయ బేరాల‌కు దిగార‌ని చ‌ర్చ గ్రామీణ స్తాయిలో జోరుగా సాగుతోంది. పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తెస్తాన‌న్న ష‌ర్మిల‌.. కాంగ్రెస్‌లో త‌న పార్టీ విలీనం కోసం ఎడ‌తెగ‌ని విధంగా ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ విష‌యంలో.. కాంగ్రెస్ ముందుకు వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి వెన‌క్కి త‌గ్గ‌డం, ఇప్పుడు మ‌ళ్లీ ఒంట‌రి పోరేన‌ని ప్ర‌క‌టించ‌డం వంటి ష‌ర్మిల రాజ‌కీయం తెలంగాణ స‌మాజాన్ని జీర్ణించుకోలేకుండా చేస్తున్నాయి. ఫ‌లితంగా త‌న గొయ్యి త‌నే త‌వ్వుకున్న‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదైనా అద్భుతం జ‌రిగితే త‌ప్ప‌.. ష‌ర్మిల పార్టీని కానీ, ష‌ర్మిల‌ను కానీ ప్ర‌జ‌లు విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు.