షర్మిల మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 Aug 2024 5:32 AM GMTఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆమె రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం ఇవ్వాలని షర్మిల నిర్ణయించినట్టు తెలుస్తోంది. అప్పటికి కూడా టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో ఆ రెండు పార్టీలను ఎండగట్టాలని షర్మిల నిర్ణయించినట్టు సమాచారం.
తద్వారా అధికార పక్షానికి తామే అసలైన ప్రతిపక్షంగా నిలవాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర చేపట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ముఖ్యంగా పాదయాత్ర చేపడితే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని షర్మిల విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2.80 శాతం ఓట్లను సాధించింది, వైసీపీలో సీట్లు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు.
రానున్న రోజుల్లో వైసీపీ మరింత బలహీనపడుతుందని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ విధానాలు, ఆలోచనలు నచ్చనివారు ఆ పార్టీని వదిలివేస్తారనే నమ్మకంతో షర్మిల ఉన్నారు. ఇప్పటికే వైసీపీకి పలువురు నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చేవారిని చేర్చుకోవడానికి టీడీపీ, జనసేన ఇష్టపడటం లేదని అంటున్నారు. బీజేపీ పరిస్థితి కూడా దాదాపు ఇంతే ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీని వీడి వచ్చేవారిపై షర్మిల దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటే.. పార్టీ బలపడిందని నమ్మకం కలిగిస్తే.. పార్టీలో చేరికలు కూడా కొనసాగుతాయని షర్మిల విశ్వసిస్తున్నారని సమాచారం.
పార్టీని బలోపేతం చేయడానికి పాదయాత్ర చేయడమొక్కటే మార్గమని షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ఆమెకు ఇదే విషయాన్ని సూచించారని ప్రచారం జరుగుతోంది.
గతంలో వైఎస్ జగన్ జైలుపాలయినప్పుడు వైసీపీ తరఫున షర్మిల పాదయాత్ర చేశారు. అలాగే తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆమె పాదయాత్రకు సిద్ధమవుతారని అంటున్నారు. దీనిద్వారా పార్టీ క్యాడర్ కూడా బలపడుతుందని షర్మిల విశ్వసిస్తున్నారు. అలాగే తన తండ్రి వైఎస్సార్ లెగసీని, ఆయన వారసత్వాన్ని తానే కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.