ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా అంతా ఊహించినట్టే వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది.
By: Tupaki Desk | 16 Jan 2024 10:00 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా అంతా ఊహించినట్టే వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
కాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. 3600 కిలోమీటర్లు తెలంగాణలో పాదయాత్ర చేశారు. అయినా ఒక్క పేరున్న నేత కూడా ఆమె పార్టీలో చేరలేదు. చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేకపోయారు. తాము పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని.. అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు.
వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందే షర్మిల కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో పోటీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో షర్మిల పోటీ చేయలేకపోయారు.
షర్మిల సేవలను ఏపీలో వాడుకోవాలని నిర్ణయించడం వల్లే తెలంగాణలో ఆమెకు ఎలాంటి అవకాశం లేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు తగ్గట్టే షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించారు.
షర్మిల తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఇటీవల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పుడే ఆమెకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దీనికి తగ్గట్టే ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. షర్మిల రాకను ఆయన గతంలోనే స్వాగతించారు.
గిడుగు రుద్రరాజు రాజీనామాతో ఏపీ పీసీసీకి అధ్యక్ష పదవికి అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది.
మరోవైపు జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డికి ఇడ్లీస్ రెస్టారెంట్ల అధినేత మనుమరాలు అట్లూరి ప్రియతో నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ పెళ్లి పనుల్లో షర్మిల బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు అతిథులను ఆమె ఆహ్వానించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయొచ్చని అంటున్నారు.