లక్ష్యం ఫిక్స్... పొలిటికల్ ఎంట్రీపై సునీత ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి తమవంతు షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల, సునీత భావిస్తున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 6 April 2024 7:55 AM GMTగత కొన్ని రోజులుగా కడప రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పైగా... కడప లోక్ సభ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిళ ప్రకటించినప్పటినుంచీ ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో... పులివెందులలో వివేకా భార్య సౌభాగ్యమ్మ పోటీచేస్తారనే ప్రచారం కూడా తెరపైకి రావడంతో వ్యవహారం మరింత హీటెక్కిపోతోంది! ఈ సమయంలో తన పొలిటికల్ ఎంట్రీపైనా.. రానున్న ఎన్నికల్లో తన లక్ష్యంపైనా సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చెశారు.
అవును... రానున్న ఎన్నికల్లో అధికార వైసీపీకి తమవంతు షాక్ ఇవ్వాలని వైఎస్ షర్మిల, సునీత భావిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా వీరిద్ధరి లక్ష్యం అవినాశ్ రెడ్డి అని చెబుతున్నారు. ఈ సమయంలో వైసీపీ టిక్కెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వడం తట్టుకోలేక, చిన్నాన్న వివేకా కోరిక మేరకు తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు షర్మిళ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... షర్మిళకు తన పూర్తి మద్దతు ఉంటుందని సునీత తెలిపారు.
ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సునీత... తాను రాజకీయాల్లోకి రావడం లేదని.. అయితే... రానున్న ఎన్నికల్లో కడపలో అవినాష్ రెడ్డి గెలవకుండా చేయడమే తన ప్రయత్నమని పేర్కొన్నారు. అలా అని తన పోరాటం రాజకీయం కోసం కాదని.. న్యాయం కోసమని చెప్పడం గమనార్హం! ఈ సందర్భంగా... నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారనే విషయం మొదట నమ్మలేదని.. ఇది తన పొరపాటేనని సునీత వ్యాఖ్యానించారు.
జస్టీస్ ఫర్ వివేకా పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చిన సునీత... 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలను సవివరంగా వివరించారు. ఇందులో భాగంగా... 2014 ఎన్నికల్లో కడప నుంచి షర్మిళ పోటీ చేస్తారని అంతా భావించారని.. అయితే, ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారని.. అది వివేకాకు ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు!
ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమిపాలయ్యారని.. అవినాష్ కుటుంబం వెన్నుపోటుతోనే ఈ ఓటమి అనే విషయం తర్వాత స్పష్టమైందని వెల్లడించారు! అయితే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తేరుకుకున్న వివేకా.. 2019 ఎన్నికలకు సిద్ధమయ్యారని సునీతా రెడ్డి వెల్లడించారు. జగన్ పాదయాత్రలో అప్పుడప్పుడు వివేకా కలిసేవారని సునీత అన్నారు. ఈ కాలక్రమంలోనే... పులివెందులలో వివేకా ఓటు జాబితాలోనే లేకుండా పోయిందని సునీత తెలిపారు.