Begin typing your search above and press return to search.

డాక్టర్ సిస్టర్... జగన్ కు సునీత ఉచిత వైద్య సలహాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 April 2024 12:42 PM GMT
డాక్టర్ సిస్టర్... జగన్ కు సునీత ఉచిత వైద్య సలహాలు!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతక ముందు స్థానికంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వివేకా హత్యోదంతాన్ని ప్రస్థావించారు. అవినాష్ తప్పుచేయలేదని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు!

ఇదే సమయంలో... వైఎస్సార్ శత్రువులతో జత కట్టిన కుటుంబ సభ్యులు ఆయనకు వారసులు ఎలా అవుతారంటూ ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో... చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు అని చెప్పిన జగన్... వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? వివేకాకు రెండో భార్య, సంతానం ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్‌ చేస్తే.. నాడు అవినాష్‌ అక్కడికి వెళ్లారు? అంటూ కీలక విషయాలు లేవనెత్తారు!

ఇదే సమయంలో... వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదని.. తాను అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానని.. అవినాష్‌ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు.. అవినాష్‌ ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి అంటూ సూచించారు జగన్. దీంతో... ఈ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇవాళ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ఆయనకున్న ద్వేషం కనిపిస్తోందని మొదలుపెట్టిన ఆమె... ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషం?.. మీ కోసం త్యాగం చేసినందుకే ఆయనపై కోపమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సమయంలో... జగన్‌ కు న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదని చెప్పిన సునీత... ఆయనకు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని కోరారు.

ఇదే సమయంలో.. అవినాష్‌ రెడ్డి చిన్న పిల్లోడని జగన్ చెబుతున్నారని చెప్పిన సునీత... ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇదే క్రమంలో... సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారని.. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దని.. తప్పు చేసి ఉంటే తనకైనా, తనభర్తకైనా శిక్ష పడాల్సిందే అని ఆమె వెల్లడించారు.

ఈ సందర్భంగా జగన్ నుదిటికి అయిన గాయంపై సునీత స్పందించారు. ఇందులో భాగంగా... సీఎం జగన్‌ కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని.. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదని.. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌ గా సలహా ఇస్తున్నానని సునీత తెలిపారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందని చెప్పుకొచ్చారు.