ఢిల్లీలో వైఎస్ సునీత కీలక ప్రెస్ మీట్.. అందుకేనా?
కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ పైన ఉన్నారు.
By: Tupaki Desk | 29 Feb 2024 11:29 AM GMT2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును ఆయన కుమార్తె సునీత వినతి మేరకు సీబీఐ విచారిస్తోంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని, సునీల్ యాదవ్ తదితరులను సీబీఐ అరెస్టు చేసింది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ పైన ఉన్నారు.
కాగా తన తండ్రి హత్య కేసు విచారణను త్వరగా తేల్చాలని వివేకా కుమార్తె సునీత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మార్చి 1న ఢిల్లీ వేదికగా కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఏం చెప్పబోతున్నారనే అనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అందులోనూ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో 45 రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సునీత ప్రెస్ మీట్ ఎలాంటి సంచలనాలు రేపుతుందనేది ఆసక్తి రేపుతోంది.
కాగా ఇప్పటికే సునీత తన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం సునీత పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మార్చి 1న ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. ఈ ప్రెస్ మీట్ లో ఆమె ఏం చెప్పబోతున్నారు? ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏమైనా చెప్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారాడు. మరోవైపు సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిపై వివేకా పీఏ కృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు సునీతను, ఆమె భర్తను విచారించారు. ఇటీవల కడప జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీని సునీత దంపతులు కలిశారు. వివేకా హత్య విషయంపై ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సునీత ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించాలనుకోవడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.