Begin typing your search above and press return to search.

వివేకా వ్యక్తిగత జీవితం గురించి సునీత ఆవేదన.. కామెంట్స్ వైరల్!

గతకొన్ని రోజులుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 April 2024 9:28 AM GMT
వివేకా వ్యక్తిగత జీవితం గురించి సునీత ఆవేదన.. కామెంట్స్ వైరల్!
X

గతకొన్ని రోజులుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇష్యూపైనే కడప లోక్ సభ ఎన్నిక జరుగుతుందనే చర్చా మొదలైంది. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తూ.. వివేకా హత్య కేసులో అవినాష్ నిందితుడని, అందువల్ల అతన్ని ఓడించాలని కోరుతూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే!

ఈ క్రమంలో షర్మిళతో పాటు ప్రచారానికి వెళ్తూ, ఆమెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్న సునీత.. తన తండ్రికి జరిగిన దారుణానికి తమకు ఓట్లతో న్యాయం చేయాలన్నట్లుగా కోరుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోమారు ఆమె తన తండ్రి హత్య గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని తెలిపారు.

పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాము న్యాయం కోసం పోరాడుతున్నామని, షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ విషయంలో అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఎక్కువగా ఉందని.. పులివెందుల ప్రజలతో పాటు తానూ బాధపడుతున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో... ప్రజలంతా తమ తమ బాధను మే 13న జరిగే ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపించాల్సిన అవసరముందని అన్నారు! ఈ క్రమంలో... వివేకానందరెడ్డిని దారుణంగా చంపించిన వారిని ఓడించాలని ఓటర్లను కోరారు. ఇదే సమయంలో... ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు. వీటన్నింటికీ ప్రజలే ఓట్ల ద్వారా తీర్పు చెప్పాలని సునీత కోరారు.

కాగా... కొద్దిరోజుల క్రితం సునీత హైదరాబాద్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో... "వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆయనకు ఆమెతో ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ ఫ్యామిలీలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా" అని ఒక విలేఖరి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నకు సమాధానంగా స్పందించిన సునీత... "ఐ డోంట్‌ నో (నాకు తెలియదు)" అని సమాధానం ఇచ్చారు!

నాటి నుంచీ ఈ విషయం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. తన తండ్రి వివేకానందరెడ్డి.. 2010లో షమీమ్‌ అనే మహిళను ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారని.. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారని.. ఆ కుమారుడికి షెహెన్‌ షా అనే పేరు కూడా పెట్టారని ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారంటూ సునీత వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు!