Begin typing your search above and press return to search.

వైసీపీకి విజయమ్మ ప్రచారం చేస్తారా...?

ఇక వైఎస్ విజయమ్మ వైసీపీకి ఆయువుపట్టుగా ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా 2022 దాకా ఉన్నారు

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:00 AM GMT
వైసీపీకి విజయమ్మ ప్రచారం చేస్తారా...?
X

వైసీపీకి మొదట్లో వైఎస్ జగన్ విజయమ్మ మాత్రమే పునాదిగా ఉంటూ వచ్చారు. కడప నుంచి ఎంపీగా జగన్, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయమ్మ వైసీపీ టికెట్ మీద ఫస్ట్ టైం పోటీ చేసి గెలిచారు. ఈ రోజున 151 మంది ఎమ్మెల్యే, 22 మంది ఎంపీలు ఆ పార్టీ టికెట్ మీద గెలిచినా ఆ పార్టీ తొలి ఎమ్మెల్యే విజయమ్మ అన్నది పార్టీ చరిత్రలో నిక్షిప్తంగా ఉంటుంది.

ఇక వైఎస్ విజయమ్మ వైసీపీకి ఆయువుపట్టుగా ఉంటూ వచ్చారు. ఆమె వైసీపీకి గౌరవ అధ్యక్షురాలిగా 2022 దాకా ఉన్నారు. అంటే దాదాపుగా పదేళ్ళ పాటు అన్న మాట. అలాగే ఆమె వైసీపీ తరఫున 2011 నుంచి ఎన్నికల ప్రచారం చేస్తూనే ఉన్నారు. 2012లో ఉమ్మడి ఏపీలో 18 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అన్ని చోట్లా ఆమె ఓపికగా తిరిగి ప్రచారం చేశారు.

అదే విధంగా 2014, 2019 ఎన్నికల గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయమ్మ ఏపీ అంతా సుడిగాలి పర్యటనలే చేసి జనాలను ఆకట్టుకునే స్పీచులనే ఇచ్చారు. ఆమె వైఎస్ జగన్ మాతృమూర్తి మాత్రమే కాదు, దివంగత నేత, వైఎస్సార్ ధర్మపత్ని. ప్రజా నేతగా జనం గుండెలలో కొలువు తీరిన వైఎస్సార్ సతీమణిగా విజయమ్మ అంటే అంతే అభిమానం జనంలో కనిపిస్తుంది.

ఇక 2024 ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. ఈ నెల ముప్పయిన జరిగే తెలంగాణా ఎన్నికలతో దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల సంగ్రామం ముగుస్తుంది. డిసెంబర్ 3న ఫలితాలు వస్తాయి. ఆ తరువాత ఏపీ ఎన్నికల హడావుడి స్టార్ట్ అవుతుంది.

వైసీపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తుని ప్రారంభించింది. మరి వైసీపీ నుంచి ఎన్నికలకు సంబంధించి స్టార్ కాంపెయినర్ ఎవరు అన్నది చర్చకు వస్తోంది. 2019 దాకా జగన్ ఒక వైపు తల్లి విజయమ్మ మరో వైపు చెల్లెలు షర్మిల ఇంకో వైపు ఎన్నికల ప్రచారం చేస్తూ వచ్చారు.

ఇపుడు మాత్రం మారిన పరిస్థితులలో వైఎస్సార్టీపీని ఏర్పాటు చేసి షర్మిల తెలంగాణాలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. అయితే తొలి ఎన్నికల్లోనే ఆమె పోటీ చేయడం మాని కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించారు. దాంతో రానున్న రోజులలో షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అన్న ఊహాగానాలు మరింతగా జోరందుకున్నాయి.

మరి వైఎస్సార్టీపీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ ఏమి చేస్తారు అన్న చర్చకు తెర లేస్తోంది. ఆమె న్యూట్రల్ గా ఉంటూ రాజకీయాల నుంచి విరమించుకుంటారా లేక ఆమె వైసీపీకి గతంలో మాదిరిగా ప్రచారం చేస్తారా అన్నదే ఇపుడు చూడాలని అంటున్నారు.

ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి స్టార్ కాంపెనియర్ గా ఎవరూ లేరు. ఇక తెలంగాణాలో ఎన్నికలు పూర్తి అవుతాయి. లోక్ సభ ఎన్నికల నాటికి షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే విజయమ్మ వైసీపీ వైపు మొగ్గు చూపుతారా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీ లో వైఎస్ విజయమ్మ తాను వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటించేశారు. దాంతో ఆమె బంధం వైసీపీతో లేకుండా పోయిందా లేక మళ్లీ కొనసాగుతుందా అన్నదే చూడాలని అంటున్నారు. ఒక వేళ విజయమ్మ జగన్ వైపునకు వస్తే షర్మిల ఏపీ రాజకీయాల మీద ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అన్న సందేహాలు వస్తున్నాయి. ఏది ఏమైనా విజయమ్మ 2024 ఎన్నికల నాటికి వైసీపీకి ప్రచారం చేస్తే సంచలనం అవుతుంది అన్న వారూ లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.