Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వేదిక మీద విజయమ్మ...?

వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2024 3:44 AM GMT
కాంగ్రెస్ వేదిక మీద విజయమ్మ...?
X

వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జయంతి. ఆయన 75వ జయంత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహలు చేస్తున్నారు. ఆమె ఏకంగా సోనియా గాంధీ రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు.

అలాగే కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీఎకే శివకుమార్ లని కూడా పిలిచారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను సైతం ఆహ్వానించారు. వీరితో పాటు ఏఐసీసీలో ఉన్న అతిరధ మహారధులను ఆమె పిలిచారు.

వీరిలో ఎంతమంది వస్తారు అన్నది పక్కన పెడితే చాలా మంది ప్రముఖులు హాజరు కావచ్చు అన్నది ఇప్పటికి వినిపిస్తున్న మాట. 2023 వరకూ ప్రతీ ఏటా వైఎస్సార్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నిర్వహించేది. కాంగ్రెస్ నాయకులు అయితే ఎక్కడికక్కడ నివాళి అర్పించేవారు.

కానీ ఈసారి సీన్ మారింది. వైఎస్సార్ తనయ ఏపీసీసీ చీఫ్. ఆమెను ఆ ప్లేస్ లో ఉంచినదే వైఎస్సార్ లెగసీని మొత్తం కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకు. అలాగే వట్టిపోయిన కాంగ్రెస్ కి గట్టిగా ఓట్లు సాధించడం కోసం. దాంతో పాటుగా షర్మిల కూడా తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

అందుకే ఆమె జయంతిని గ్రాండ్ లెవెల్ లో నిర్వహిస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఈ సభలో పాల్గొంటారు అని వార్తలు వస్తూండటం.

ఆమె వైసీపీలో గౌరవ అధ్యక్షురాలిగా 2022 దాకా ఉన్నారు. ఆ తరువాత ఆ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణాలో పార్టీ పెట్టిన కుమార్తె కోసం పనిచేస్తాను అని ఆనాడు చెప్పారు. వైఎస్సార్టీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఆమె కొంతకాలం వ్యవహరించారు.వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఏపీలో ఎన్నికల వేళ జగన్ ని దీవించారు. అలాగే షర్మిలను దీవించారు. అంతవరకూ ఆమె న్యూట్రల్ గానే ఉన్నారు. అయితే సరిగ్గా పోలింగ్ కి రెండు రోజుల ముందు ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న షర్మిలకు ఓటు వేయమని వీడియో సందేశం ద్వారా అప్పీలు చేయడంతో వైసీపీకి అది శరాఘాతంగా తగిలింది. అంతే కాదు విజయమ్మ కుమార్తె పక్షమే అని చెప్పకనే చెప్పినట్లు అయింది.

అయితే కుమార్తె ఎన్నికల్లో గెలవడం కోసం ఒక తల్లిగా ఆమె అలా చేశారని సరిపెట్టుకున్నా ఇపుడు కాంగ్రెస్ నాయకత్వంలో విజయవాడలో జరిగే వైఎస్సార్ జయంతి వేడుకలకు విజయమ్మ కనుక హాజరైతే మాత్రం వైసీపీకి భారీ షాకే అని అంటున్నారు. విజయమ్మ పూర్తిగా కూతురు రాజకీయానికే సపోర్ట్ చేస్తున్నారు అని అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.

అయితే తన భర్త వైఎస్సార్ పేరిట జరుగుతున్న కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగానే ఆమె పాల్గొంటున్నారు అని భావించినప్పటికీ ఆమె షర్మిలకు ఓటు వేయమని పిలుపు ఇవ్వడాన్ని దీనితో ముడిపెట్టి విశ్లేషణలు చేయడం కూడా జరుగుతుంది అని అంటున్నారు. ఇక విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపిసే అది కూడా రాజకీయంగా వైఎస్సార్ అభిమానులకు సరికొత్త సందేశం ఇచ్చినట్లుగా ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా విజయమ్మ కాంగ్రెస్ వేదికను పంచుకోవడం అంటూ జరిగితే అది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అని అంటున్నారు

అయితే వైఎస్సార్ జయంతి వేళ ఊరూరా సేవా కార్యక్రమాల్ను నిర్వహించాలని వైసీపీ పిలుపు ఇచ్చింది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కూడా భారీ ఎత్తున వైఎస్సార్ రిమార్కబుల్ 75వ జయంతిని నిర్వహిస్తే బాగుండేది అన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ రెండు కార్యక్రమాలను సాదర జనం సరిపోల్చుతూ వైఎస్సార్ లెగసీ ఎవరికి ఇవ్వాలో కూడా ఆలోచిస్తారని కూడా అంటున్న వారూ ఉన్నారు.

అయితే తాము వైఎస్సార్ ని ఎపుడూ గౌరవిస్తూనే ఉన్నామని ఓట్ల కోసం ఆయన పేరుని తలచుకునే వారు ఎవరైనా ఏ కార్యక్రమం అయినా నిర్వహించుకోవచ్చు అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అనడం విశేషం.