Begin typing your search above and press return to search.

వైఎస్ విజయమ్మ కన్నీళ్ళు : ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారా ?

వైఎస్సార్ ధర్మపత్నిగా వైఎస్ విజయమ్మకు తెలుగు ప్రజల గుండెలలో ప్రత్యేక స్థానం ఉంది

By:  Tupaki Desk   |   8 July 2024 10:30 AM GMT
వైఎస్ విజయమ్మ కన్నీళ్ళు : ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారా ?
X

వైఎస్సార్ ధర్మపత్నిగా వైఎస్ విజయమ్మకు తెలుగు ప్రజల గుండెలలో ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్సార్ జీవించి ఉన్న రోజులలో ఆమె ఎపుడూ బయటకు వచ్చేవారు కాదు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఒకసారి మాత్రం ఆమె ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక వైఎస్సార్ ఎన్నికల ప్రచారం చేసి వస్తూంటే ఆయనకు స్వాగతం పలకడం వంటి ఫోటోలతో ఆమె గురించి జనాలకు అపుడు తక్కువగానే తెలిసేది.

వైఎస్సార్ మరణం తరువాత ఆయన పులివెందుల అసెంబ్లీ సీటుకు వైఎస్ విజయమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా ఆమెకు ఒక సముచితమైన స్థానం రాజకీయంగా తొలి నాళ్ళలోనే లభించింది. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి జగన్ వేరు పడి వైసీపీని స్థాపించారు. అపుడు ఆమె కుమారుడి వెంట ఉన్నారు. ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు.

వైసీపీకి ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ వచారు. కుమారుడు జగన్ కోసం ఆమె ఏపీ అంతటా విస్తృతంగా పర్యటించారు. జగన్ జైలులో ఉన్నపుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఊరూరా తిరీ వైసీపీకి గెలిపించారు. అలాగే 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆమె వైసీపీ కోసం పనిచేసారు.

వైసీపీ ప్లీనరీ సమావేశాలలో ఆమె హానరరీ ప్రెసిడెంట్ గా ఉంటూ కేలకంగా వ్యవహరించేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం సీన్ మారింది. షర్మిల 2021లో సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణాలో రాజకీయం మొదలు పెడితే విజయమ్మ కూడా ఆమె వెంట నడచారు. వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు.

ఇక వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో అన్న జగన్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచినపుడు విజయమ్మ సర్ది చెప్పలేక పోయారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె 2022లో గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీ లో మాట్లాడుతూ ఏపీలో జగన్ బాబు ఉన్నారు. తెలంగాణాలో వైఎస్సార్ అభిమానుల కోసం షర్మిల పార్టీ పెట్టారు.అమె వెంట ఉంటూ ఆమె రాజకీయ భవిష్యత్తుకు కృషి చేస్తాను అని చెప్పారు.

కానీ జరిగింది మాత్రం వేరుగా ఉంది. ఒకే ఒరలో రెండు కత్తులు మాదిరిగా జగన్ షర్మిల ఏపీలో తలపడి వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓటమి పాలు కావడానికి దోహదపడ్డారు. ఈ విషయంలో విజయమ్మ సైతం ఇద్దరికీ సర్ది చెప్పలేక చివరికి షర్మిలను గెలిపించాలంటూ ఆఖరులో కూతురు సైడ్ తీసుకోవడం ద్వారా తాను కూడా విమర్శల పాలు అయ్యారు.

వైఎస్ జగన్ ఘోరమైన ఓటమిలో తల్లిగా విజయమ్మ పాత్ర కూడా ఉందన్న నిందను ఆమె మోయాల్సి వచ్చింది. నిజానికి వైసీపీ 2024లో ఓడినా ఇంతటి దారుణమైన ఫలితాలు మాత్రం వచ్చేవి కావు. కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అన్నకు వ్యతిరేకంగా చేసిన ప్రచారం వల్లనే వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది అని అంటున్నారు. ఆ విధంగా ఆ ఓట్లు కాంగ్రెస్ కి పడకపోగా గుత్తమొత్తంగా కూటమి వైపు మళ్ళాయి. అలా వైసీపీకి కంచుకోటలు బద్దలు అయ్యాయి.

వైఎస్ విజయమ్మ న్యూట్రల్ గా ఉండి ఉంటే బాగుండేది అన్న భావన కూడా వ్యక్తం అయింది. అదే టైం లో ఆమె కుమారుడు కుమర్తె మధ్య రాజీ కుదుర్చి ఏదో కాడికి సర్దుబాటు చేసి ఉండాల్సింది అన్న చర్చ కూడా ఉంది. కానీ విజయమ్మ ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు అని అంటున్నారు. దాని ఫలితమే వైఎస్సార్ ఘాటు వద్ద విజయమ్మ పెట్టిన కన్నీళ్ళు అని అంటున్నారు.

ముందు కుమారుడు తరువాత కుమార్తె విడివిడిగా వైఎస్సార్ కి నివాళి అర్పించిన కార్యక్రమానికి సాక్షిగా విజయమ్మ నిలిచారు అని అంటున్నారు. రాజకీయాల్లోనే కాదు వ్యాపార రంగాల్లోనూ కీలకమైన ఇతర రంగాల్లోనూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. అయితే వాటిని ఏదో ఒక దశలో సర్దుబాటు చేసుకోకపోతే ఏమి జరుగుతుంది అన్న దానికి వైఎస్సార్ కుటుంబం ఒక ఉదాహరణగా మిగిలింది అని అంటున్నారు.

దేశంలోనే అతి పెద్ద వాణిజ్య కుటుంబం అంబానీ ఫ్యామిలీలో విభేదాలు తలెత్తితే వాటిని సామరస్యంగా అంబానీ సోదరుల తల్లి సర్దుబాటు చేసి ఒక దారికి తెచ్చారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న వారూ ఉన్నారు. ఇక తెలుగునాట ఎన్టీయార్ రాజకీయ వారసత్వం విషయంలో మొదట్లో పెద్ద రచ్చ సాగినా ఈ రోజున చూస్తే అంతా ఒకటిగా ఉంటున్నారు అంటే సర్దుబాట్లు కారణం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక తల్లిగా విజయమ్మకు ఇది తీరని బాధగానే ఉంటుంది అన్నది వాస్తవం.