Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది

By:  Tupaki Desk   |   3 May 2024 8:19 AM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి భారీ ఊరట దక్కింది. వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఈ కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ పిటిషన్‌ ను కొట్టేస్తూ తీర్పునిచ్చింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షులను అవినాష్‌ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని దస్తగిరి తన పిటిషన్‌ లో ఆరోపించాడు. కాబట్టి ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ ను రద్దు చేయాలంటూ కోర్టుకు విన్నవించాడు.

అయితే దస్తగిరి వాదనను అవినాష్‌ రెడ్డి తరఫు న్యాయవాదులు ఖండించారు.

రాజకీయ దురుద్దేశంతోనే దస్తగిరి పిటిషన్‌ వేశాడని కోర్టుకు నివేదించారు.

దస్తగిరి ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. నిరాధార ఆరోపణలతోనే ఈ పిటిషన్‌ వేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దర్యాప్తు సంస్థ సీబీఐ.. అవినాశ్‌ రెడ్డి బెయిల్‌ రద్దు ఎప్పుడూ కోరలేదన్నారు.

అవినాశ్‌ రెడ్డి హైకోర్టు షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అతడి తరఫున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఆయన సాక్షులను బెదిరించినట్లు ఎక్కడా ఆధారాల్లేవు అని తెలిపారు.

వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి విషయంలో సైతం ఆధారాల్లేవన్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ చార్జిషీటు వేసిందని అవినాశ్‌ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు దస్తగిరి పిటిషన్‌ ను కొట్టేసింది.

మరోవైపు వైఎస్‌ వివేకా హత్య కేసులో చెంచలగూడ జైలులో ఉన్న అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి కూడా ఊరట దక్కింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ లకు బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది.

కాగా వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నికల వేళ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు ఇస్తూ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. వైఎస్‌ వివేకాను చంపానని స్వయంగా దస్తగిరే చెబుతున్నా.. ఆయనను అప్రూవర్‌ గా మార్చి తమపై బురద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలు నిందితులను తప్పించి తమను ఇరికించడానికి సునీత ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైతం తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.