వివేకా హత్య... ఎప్పటికీ మిస్టరీనే...!?
రాజకీయ చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి. అందులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా చేరుతుందా అంటే డౌట్లు అలాగే వస్తున్నారు
By: Tupaki Desk | 15 March 2024 5:30 PM GMTరాజకీయ చరిత్రలో చాలా మిస్టరీలు ఉన్నాయి. అందులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కూడా చేరుతుందా అంటే డౌట్లు అలాగే వస్తున్నారు. ఆయన సామాన్యుడు కాదు, ఒక ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఒక దివంగత ముఖ్యమంత్రికి అనుంగు సోదరుడు. మరో ముఖ్యమంత్రికి స్వయాన బాబాయ్. తాను ఎంపీ గా మంత్రిగా పనిచేసిన వారు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయనది.
అటువంటి వైఎస్ వివేకాను అజాత శత్రువు అని అంటారు. కానీ ఆయన సరిగ్గా ఇదే రోజున అంటే 2019 మార్చి 15న దారుణ హత్యకు గురి అయ్యారు. ఈ హత్య విన్న వారు అంతా నమ్మలేకపోయారు. సాధు జీవి ఏడు పదులకు చేరువలో ఉన్న వారు పెద్ద మనిషి వివేకాను హత్య చేయడమేంటి అన్న చర్చ మొదలైంది.
ఆయనను అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని కూడా ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. విపక్షంలో వైసీపీ ఉంది. సహజంగానే నాటి అధికార పక్షం మీదనే అన్ని వేళ్ళూ వెళ్లాయి. అయితే ఎన్నికల ప్రచారం నాటికి వచ్చేసరికి మాత్రం అది సొంత వాళ్ళు చేయించిన హత్యే అని చంద్రబాబు తన ఎన్నికల ప్రచార సభలలో ఊరూరా తిరిగి చెప్పారు. భారీ ఆరోపణలు చేశారు.
కానీ ఆ ఎన్నికల్లో వివేకా హత్య కేసు కడప సహా రాయలసీమ ప్రాంతంలో ఎంతో కొంత సానుభూతిని వైసీపీకే తెచ్చిపెట్టింది. ఇక జగన్ సీఎం అయ్యాక నాడు ఆయన కోరిన సీబీఐనే విరమించుకున్నారని ప్రచారం సాగింది. ఆ తరువాత వైఎస్ వివేకా కుమార్తె సునీత కోర్టుకు వెళ్ళి మరీ సీబీఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు. మొత్తానికి చూస్తే గత అయిదేళ్ళుగా సాగుతున్న దర్యాప్తులో ఎవరు సూత్రధారులు అన్నది మాత్రం బయటకు రాలేదు.
ఆరోపణలు ఎవరి మీద ఎవరు అయినా చేసుకుంటారు. కానీ దర్యాప్తు సంస్థలకు సాక్ష్యాలు కావాలి. అవి ఎస్టాబ్లిష్ అయినట్లుగా ఈ కేసులో ఎక్కడా లేదు. హత్య తాను స్వయంగా చేశాను అని చెబుతున్న దస్తగిరి బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయనను పురిగొల్పిన వారు అని వినిపిస్తున్న పేర్లలో కొందరికి బెయిల్ దక్కింది. అంతకు మించి ఇంకా తెర వెనక ఎవరు ఉన్నారు అన్నది మాత్రం బయటకు రాలేదు.
ఇదిలా ఉండగా వివేకా అయిదవ వర్ధంతి వేళ కడపలో ఆయన కుమార్తె సునీత ఘాటు వ్యాఖ్యలు చేసారు. తన తండ్రిని హత్య చేసిన వారు బంధువులే అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వారిని శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ కేసులో న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంత కరణ శుద్ధిగా అంటూ సీఎం గా ప్రమాణం చేసిన జగన్ కి అంత కరణ అన్న దానికి అర్ధం తెలుసా అని చెల్లెలు సునీత ప్రశ్నించారు.
ఇక సొంత చెల్లెలు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల అయితే తన అన్న మీద తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన అద్దంలో చూసుకుని తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సూచించారు. మొత్తానికి చెల్లెళ్ళు ఇద్దరూ జగన్ మీద విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ సూటి ప్రశ్నలు సంధించారు. సునీత మీద నిందలు మోపుతున్నారని ఆమె కనుక ఈ హత్య వెనక ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రభుత్వం అని అంటున్నారు.
మరో వైపు వైసీపీ నుంచి కూడా ఇదే తీరున ప్రశ్నలు వస్తున్నాయి. బంధువులు హత్య చేశారు అని చెబుతున్నారు కదా ఇలా బహిరంగ సభలలో మాట్లాడేబదులు ఆ ఆధారాలు వివరాలు సీబీఐకి ఇచ్చి వారిని అరెస్ట్ చేయించవచ్చు కదా అని. అంటే ఇక్కడ ఒకటి స్పష్టం అసలు ఆధారాలు అన్నవి పెద్దగా కనిపించడంలేదు. అవి దొరకకుండా పోయి అయి ఉండాలి. లేదా అనుమానాలుగా అయినా ఉండాలి.
ఏది ఏమైనా కూడా వివేకా వంటి మంచి వ్యక్తి లేకుండా అయిదేళ్ళు గడచాయి. ఆయన హత్య కేసులో సూత్రధారులు ఎవరు అన్నది ఎప్పటికైనా తెలుస్తుందా అంటే ఏమో చెప్పలేమనే జవాబు కూడా వస్తోంది. మిస్టరీలు ప్రముఖుల కేసులలో చాలా జరుగుతున్నాయి. ఇది కూడా అలాంటిదే అయిపోతుంది అనే అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా వివేకా హత్య కేసు కేవలం కడప జిల్లా వరకూ పులివెందుల వరకూ ఒక కీలక అంశంగా ఉండవచ్చు అని అంటున్నారు.
జనాలు ఇచ్చే తీర్పు ఈ ఒక్క అంశం మీద ఉండకపోవచ్చు అన్నది కూడా రాజకీయాలు తెలిసిన వారు చెప్పే మాట. ఇక షర్మిల వేరే పార్టీలో ఉన్నారు. ఇప్పటికే అన్నను నిందిస్తూ ప్రచారం చేస్తున్నారు. సునీత అయితే దాయాదిగా ఉన్నారు. సో వారి విమర్శలకు ఇపుడు ఈ సమయంలో ఎంతవరకూ విలువ ఉంటుంది అన్నది కూడా మరో చర్చ. పైగా వారితో పాటు వేదిక మీద కూర్చున్న వారు టీడీపీ సహా వైసీపీ బద్ధ శత్రువులే. మొత్తం మీద వివేకా హత్య కేసును ఎప్పటికైనా చేదించి దోషులను శిక్షించాలనే అంతా కోరుకుంటున్నారు. కానీ అది జరిగేనా అన్నదే పెద్ద డౌట్.