ఆ పార్టీకి గుర్తొచ్చిందోచ్... "నాలుగు కళ్ల"తో నలుచెరగులా పోటీ
వైటీపీకి ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం ఉమ్మడి గుర్తుగా "బైనాక్యులర్"ను కేటాయించింది.
By: Tupaki Desk | 26 Oct 2023 4:40 PM GMTసొంత అన్న పొరుగు రాష్ట్రంలో సీఎంగా ఉండగా.. సంచలన రీతిలో తెలంగాణను తన కార్యక్షేత్రంగా ఎంచుకుని స్థాపించిన పార్టీకి ఎన్నికల సంఘం "ఉమ్మడి గుర్తు"ను కేటాయించింది. అది కూడా కీలక ఎన్నికల సమయంలో ఇచ్చింది. దీంతో ఆ పార్టీ వర్గాలకు ఉపశమనం లభించింది. వాస్తవానికి ఈ ప్రక్రియ ఇంకాస్త ముందుగా జరుగుతుందని భావించారు. అయితే, ఎన్నికల సంఘం నుంచి ఆమోదం ఆలస్యం అవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరిగింది. ఏమైతేనేం..? తెలంగాణలో మరొక్క 35 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా "గుర్తు" రావడంతో శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
ఉమ్మడి గుర్తుంటే ప్రయోజనం ఇది?
2021 జూలై 7న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన పేరిటనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ)ని స్థాపించిన వైఎస్ షర్మిలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. వాస్తవానికి వైటీపీ నెలకొల్పాక పలు ఉప ఎన్నికలు జరిగినా ఆ పార్టీ పోటీ చేయలేదు. కొత్త పార్టీ అయిన నేపథ్యంలో సమాయత్తం కావడం కష్టమనే భావనతోనే ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారని భావించవచ్చు. దీంతో వైటీపీ ఎన్నికల గుర్తు ఏమిటనేది ఇంతవరకు తెలియరాలేదు. ఇప్పుడు మాత్రం ఎన్నికల సంఘం.. ఉమ్మడి గుర్తును ఇచ్చింది. దీంతో తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఇదే గుర్తుపై పోటీ చేసేందుకు అవకాశం లభించనుంది.
టెన్షన్ తీరింది..
వైటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్వయంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సాక్షాత్తు అధినేత్రి పోటీ చేస్తున్నప్పటికీ ఆమె పార్టీకి గుర్తు లేకపోవడంతో పెద్ద సమస్య అవుతుందని శ్రేణులు ఆందోళన చెందాయి. ఉమ్మడి గుర్తు రాకుంటే.. షర్మిలకు ఒక గుర్తు వచ్చి.. మిగతా అభ్యర్థులకు మరో గుర్తు వస్తే.. ప్రచారంలోనూ ఇబ్బంది ఎదురవుతుంది. అదెలాగంటే.. షర్మిలకు పాలేరులో ఉదాహరణకు విజిల్ గుర్తు వచ్చిందనుకోండి. పొరుగునున్న ఖమ్మంలో ఆమె పార్టీ అభ్యర్థికి చెంచా గుర్తు లభిస్తే ఓటు కోసం అభ్యర్థించేటప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ తలెత్తుతుంది. కానీ, ఇప్పుడా సందేహాలేమీ లేకుండా ఉమ్మడి గుర్తు దక్కింది.
బైనాక్యులర్.. కాస్త భిన్నమే
వైటీపీకి ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం ఉమ్మడి గుర్తుగా "బైనాక్యులర్"ను కేటాయించింది. అంటే .. ఇదే గుర్తు అన్ని స్థానాల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు దక్కుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కాగా ,బైనాక్యులర్ గుర్తు కాస్త విభిన్నమే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలోని పార్టీలకు కారు, హస్తం, కమలం, కంకి కొడవలి, సుత్తి కొడవలి నక్షత్రం, ఏనుగు తదితరు గుర్తులున్నాయి. వీటికి భిన్నంగా సుదూరంలో ఉన్న వస్తువును గుర్తించే "బైనాక్యులర్" గుర్తు షర్మిల పార్టీకి లభించింది.
విలీనం లేదు.. పోటీనే మిగిలింది
షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ ముందుకెళ్లారు. ఈ మేరకు చర్చలు జరిగినప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామంటూ ఆమె స్పష్టం చేశారు. మరిప్పుడు బైనాక్యులర్ గుర్తుతో ఎంత దూరం వెళ్తారో చూడాలి.