లోక్ సభ ఎన్నికల్లో యువరాజ్ సింగ్... నియోజకవర్గం ఫిక్స్!
చాలామంది సినీ నటులు, క్రికెటర్లు తమ సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్ లో ప్రారంభిస్తుండటం సహజంగా జరుగుతూ ఉండే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Feb 2024 2:51 PM GMTచాలామంది సినీ నటులు, క్రికెటర్లు తమ సెకండ్ ఇన్నింగ్స్ పాలిటిక్స్ లో ప్రారంభిస్తుండటం సహజంగా జరుగుతూ ఉండే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది రాజ్యసభకు ఎన్నికవుతుంటే.. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ కూడా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడని అంటున్నారు.
అవును... టీం ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడంటూ గతకొన్ని రోజులుగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువీ పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని నెట్టింట ఒక వార్త వైరల్ గా మారుతుంది. వీటికి బలం చేకూరుస్తూ ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.
ఇందులో భాగంగా... తాజాగా యువరాజ్ సింగ్ తన తల్లి షబ్నమ్ తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. దీంతో యూవీ పొలిటికల్ ఎంట్రీ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే తన పొలిటికల్ ఎంట్రీపై అటు యువరాజ్ సింగ్ కానీ, ఇటు బీజేపీ పెద్దలు కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ప్రస్తుతం గురుదాస్ పూర్ నియోజకవర్గ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈయన 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి.. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 82,459 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అంతక ముందు మరో బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా బీజేపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి 1998, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు.
కాగా... టీం ఇండియా క్రికెటర్లు గతంలో చాలామంది పార్లమెంట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా... హర్భజన్ సింగ్ కూడా ఆం ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇక టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంభీర్... కాంగ్రెస్ అభ్యర్థిపై 3,91,222 భారీ మెజారిటీతో గెలుపొందాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఈ సమయంలో గంభీర్, బజ్జీ ల సమకాలికుడైన యూవీ కూడా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నడంటూ కథనాలొస్తున్నాయి!!