తీవ్ర మనో వేదనలో టీమ్ ఇండియా క్రికెటర్
అయితే, వీరిద్దరూ విడిపోయారంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ సాగుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో పరస్పరం అన్ ఫాలో చేసుకున్నారు.
By: Tupaki Desk | 6 Jan 2025 3:29 PM GMTమిగతా దేశాల జట్లతో పోలిస్తే టీమ్ ఇండియాలో క్రమశిక్షణ చాలా ఎక్కువే. ఆటగాళ్ల ఎంపికపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, బోర్డుకు చెప్పకుండా ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలాంటివన్నీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద పరిగణిస్తారు. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితంపైనా ఓ కన్నేసి ఉంచుతారు. అప్పటికీ టీమ్ ఇండియా క్రికెటర్లు కొందరు గాడి తప్పుతున్న ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి. ఉదాహరణకు గత ఏడాది వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ దేశవాళీ మ్యాచ్ లు ఆడమంటే ఆడలేదు. ఆపై దుబాయ్ లో ప్రయివేటు పార్టీలో కనిపించాడు. దీనికి ఫలితంగా అతడు టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా కిషన్ లాగే దేశవాళీలు ఆడలేదు. అయితే, ఆ తర్వాత తప్పు దిద్దుకొన్నాడు. వీటికి భిన్నంగా మరో క్రికెటర్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.
టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ప్రతిభావంతడైన బౌలర్. ఎన్నో మ్యాచ్ లను గెలిపించాడు. సన్నగా ఉండే చహల్ ను చూస్తే వికెట్ కేసి బంతిని వేయగలడా? అనిపిస్తుంది. కానీ, అతడి బంతిలో వైవిధ్యం ఉంటుంది. టెస్టులు ఒక్కటి కూడా ఆడకున్నా 72 వన్డేల్లో 121 వికెట్లు తీశాడు. 80 టి20ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది జూన్ లో టి20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో చహల్ సభ్యుడు కూడా.
చహల్ మంచి ఫామ్ లో ఉండగా 2020లో కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మను ప్రేమించి పెళ్లాడాడు. చిన్న పరిచయం ప్రేమగా మారి వివాహం వరకు వచ్చింది. అయితే, వీరిద్దరూ విడిపోయారంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ సాగుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో పరస్పరం అన్ ఫాలో చేసుకున్నారు. చాహల్ తన ఖాతా నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించాడు
ధన శ్రీ మాత్రం చహల్ తో ఉన్న ఫొటోలను తీసివేయలేదు. ఇక వీరు విడిపోవడంపై అధికారిక ప్రకటన చేయలేదు. నెటిజన్లు మాత్రం తలో మాట అంటున్నారు. కాగా, చహల్ ధనశ్రీని బాగా ప్రోత్సహించేవాడు. టీవీ కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాల్లో ఆమె డ్యాన్స్ పై విమర్శలు వస్తే అండగా నిలిచేవాడు. సోషల్ మీడియాలోనూ వీరిద్దరూ చాలా యాక్టివ్. కలిసి దిగిన ఫొటోలు, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు తరచూ పెట్టేవారు. అలాంటివారు ఎందుకు విడిపోతున్నారో తెలియడం లేదు. ఇద్దరిలో ఒకరు నోరు విప్పితే కానీ నిజం ఏమిటో తెలియదు.