Begin typing your search above and press return to search.

ఆ ఆరోపణలు.. కోర్టుకెక్కిన వైవీ!

ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనపై వేసిన విచారణను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:00 AM GMT
ఆ ఆరోపణలు.. కోర్టుకెక్కిన వైవీ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

కాగా టీటీడీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని, అలాగే అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని, లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలిచ్చి నాసిరకం నెయ్యిని కొనుగోలు చేశారని వైవీ సుబ్బారెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆయనపై విజిలెన్స్, ఎనఫోర్సుమెంట్‌ విచారణకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనపై వేసిన విచారణను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. టీటీడీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్, ఎనఫోర్సుమెంట్‌ ఎస్పీ కోరారని కోర్టుకు నివేదించారు. టీటీడీ స్వతంత్ర ప్రతిప్తతి గల సంస్థ అని, దానిపైన విచారణ చేసే అధికారం విజిలెన్స్‌ కు లేదని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

‘నా పై ఉన్న ఆరోపణలేంటి? అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరితే విజిలెన్స్‌ ఎస్పీ స్పందించలేదు. నా వివరణ లేకుండానే విచారణ పూర్తిచేశారు’ అని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్‌ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

టీటీడీకి సొంత విజిలెన్స్‌ విభాగం ఉందని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్‌ లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై ప్రభుత్వం వేసిన విజిలెన్స్, ఎనఫోర్సుమెంట్‌ విచారణను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.

తన పిటిషన్‌ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, విజిలెన్స్, ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టర్, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌ పై హైకోర్టు సెప్టెంబర్‌ 23న విచారణ జరపనుంది.