బాబాయ్ చుట్టూ ఆశావహులు...మ్యాటర్ అదేనా..?
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అధినాయకత్వం ఇప్పటికే సూచించింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Sep 2023 11:30 PM GMTఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖకు మకాం త్వరలో మారుస్తారు అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి విశాఖకు వస్తూ పోతూ షటిల్ సర్వీని ప్రస్తుతానికి చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని అధినాయకత్వం ఇప్పటికే సూచించింది అని అంటున్నారు. దానికి అనుగుణంగా ఆయన కూడా విశాఖలో తన నివాసాన్ని తొందరలో ఏర్పాటు చేసుకుంటారు అని అంటున్నారు.
గత నెలతో టీటీడీ చైర్మన్ పదవీకాలం కూడా పూర్తి అయిన నేపధ్యంలో పూర్తి స్థాయిలో పార్టీ మీదనే ఫోకస్ చేయమని అధినాయకత్వం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే వైవీ సుబ్బారెడ్డి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ని ఎప్పటికపుడు అధినాయకత్వం చెవిన వేస్తున్నారు అని అంటున్నారు. దానికి అనుగుణంగా హై కమాండ్ చర్యలు తీసుకుంటోంది.
అలా ఇంచార్జిల మార్పు కూడా చాలా నియోజకవర్గాలలో జరిగింది. తాజాగా విశాఖ తూర్పులో కూడా వైసీపీ ఇంచార్జి అయిన అక్రమాని విజయనిర్మలను మార్చేసి విశాఖ ఎంపీ గా ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు. అక్కడ పార్టీ పనితీరు మందగించిందని వైవీ ఇచ్చిన నివేదిక కూడా మార్పునకు కారణం అంటున్నారు.
అదే విధంగా వైవీ సుబ్బారెడ్డి సౌత్ నియోజకవర్గంలో పార్టీ లుకలుకలను సెట్ చేసి పెట్టారు. టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఖాయమని కూడా ఆయనే ప్రకటించారు. ఆయనకు గట్టి పోటీగా ఉన్న ఆ నియోజకవర్గం నేత అయిన కోలా గురువులుని తెచ్చి విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ ని చేశారు. అలాగే డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా అప్పగించారు. దీని వెనక వైవీ పాత్ర ఉందని అంటున్నారు.
ఇక పనితీరు బాగాలేని చోట్ల ఇంచార్జిలను మార్చేస్తామని కూడా వైవీ తాజాగా హెచ్చరించారు. ఈ నేపధ్యంలో ఆయన చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. తమకు ఎక్కడో ఒక చోట ప్లేస్మెంట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. టీడీపీలో దశాబ్దాల కాలం పనిచేసి వైసీపీలోకి మూడేళ్ల క్రితం చేరిన మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన విశాఖ సౌత్ కానీ నార్త్ కానీ కోరుకుంటున్నారు. సౌత్ అయితే వాసుపల్లి పేరు ఖరారు అయిందని అంటున్నారు.
నార్త్ కి ఇంచార్జిగా కేకే రాజు ఉన్నారు. ఆయన పనితీరు పట్ల విమర్శలు లేనప్పటికీ వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణలు పెద్ద పాత్ర పోషిస్తాయని అంటున్నారు. దాంతో ఓసీ అయిన రాజు ప్లేస్ లో తప్పనిసరిగా మార్పులు ఉంటే కనుక తమకు ఉపయోగపడుతుందని అంటున్నారు. అలా నార్త్ మీద కన్నేసిన ఎస్ ఎ రహమాన్ వంటి వారు వైవీకి టచ్ లో ఉంటున్నారు.
అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారు సైతం ఆయనను కలసి తమ గురించి వివరంగా చెప్పుకుంటున్నారు. అయితే వైవీ సిఫార్సు చేసినా కూడా హై కమాండ్ సర్వేలు కూడా సరిపోల్చి చూసుకుంటుంది, అదే విధంగా గెలుపు గుర్రం అయితేనే టికెట్ కన్ ఫర్మ్ అంటున్నరు. ఈ పరిణామాల నేపధ్యంలో బాబాయ్ చెప్పారని ఓకే చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. అదే టైం లో వైవీ మాటకు కూడా విలువ ఉంటుందని ఆయన చుట్టూ చాలా మంది తిరుగుతున్నారు. అలా బాబాయ్ జపం చేస్తున్నారు.
అయితే విశాఖ వంటి టఫ్ సిటీకి వైవీ పార్టీ తరఫున బాధ్యత తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నాలుగు సీట్లు పోగొట్టుకున్న చోట ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. టీడీపీకి పట్టు బాగా ఉన్న చోట ప్రయోగాలు చేయడానికి వైసీపీ సిద్ధపడదనే అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీలో బాబాయ్ మాత్రం ఇపుడు పార్టీ జనాలకు వీవీఐపీ అయిపోయారు. ఆయన చెబితే చాలు అని భావిస్తున్నారు. మరి బాబాయ్ మాట ఏంటో చూడాల్సి ఉంది.