'జగన్‌తో ఉంటేనే జీవితం'
ఇదేసమయంలో "టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశాం. మొత్తం స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం.
By: Tupaki Desk | 22 Feb 2024 3:47 AM GMTవైసీపీ అధినేత జగన్‌తో ఉన్నవారికే రాజకీయ జీవితం ఉంటుందని, ఈ క్రమంలో కొన్ని కష్టాలు, నష్టాలు కూడా ఉంటాయని ఆ పార్టీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఎన్నికల సంఘం నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతలపైనా.. వైసీపీ నుంచి ఇటీవల కాలంలో వెళ్లిపోయిన వారిపైనా విమర్శలు గుప్పించారు. వైసీపీలో ఉన్నవారికే రాజకీయ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు.
ఇదేసమయంలో "టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశాం. మొత్తం స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ చేస్తాం. మా పార్టీ నుండి వెళ్లిన నేతలు తిరిగివస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉండే నేతలకు రాజకీయ మనుగడ ఉండదు. సీఎం జగన్ వెంటే జనం ఉన్నారు" అని సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంద్రబాబు చివరి వరకు కూడా రాజ్యసభకు పోటీ పెట్టాలని ప్రయత్నించారని, సంఖ్యా బలం లేకపోయినా.. ఆయన రాజ్యసభలో అభ్యర్థిని నిలపాలని అనుకున్నారని చెప్పారు. కానీ, వైసీపీ బలం ముందు నిలవలేక పోయారని అన్నారు.
కట్ చేస్తే.. గతంలో వైవీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే రాజకీయ భవితవ్యం ఉంటుందన్నారు. కానీ, ఆయనే స్వయంగా బయటకు వచ్చారు. జగన్‌కు జై కొట్టారు. ఇప్పుడు మాత్రం సుద్దులు చెబుతుండడం గమనార్హ. అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపై సాగే రాజీకీయ ప్రయాణంలో ఇటు పార్టీలైనా.. అటు నాయకులైనా కూడా.. ఎవరి వ్యక్తిగత అవకాశాలు, అవసరాలు వారు చూసుకుంటారు. దీనిలో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు ఆయనకు రాజకీయంగా రాజ్యసభ భవిష్యత్తు కనిపించే సరికి ఇలా వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. సంఖ్యా బలం లేకపోయినా.. గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ వర్ల రామయ్యను పోటీకి నిలిపింది. అయితే.. ఇప్పుడు ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించి.. పోటీ నుంచి తప్పుకొంది. ఇది ఒకరకంగా వైసీపీకి మేలు చేసిందనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వైవీ మాత్రం టీడీపీని కించపరిచేలా వ్యాఖ్యానించారని అంటున్నారు. వాస్తవానికి ఎన్నిక జరిగి ఉంటే.. వైసీపీ అసంతృప్త వాదులు ఎంత మంది ఉన్నారో స్పష్టం అయిపోయేది. కానీ, ఎందుకో చంద్రబాబు ఈ దఫా.. కొంత ఎన్నికల హడావుడిలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు పోటీ నుంచి విరమించుకున్నారు.