Begin typing your search above and press return to search.

వైవీ సుబ్బారెడ్డి మాట మోడీ వింటారా?

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు లక్షిత దాడులు జరిగినట్లు వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   13 Jun 2024 8:48 AM GMT
వైవీ సుబ్బారెడ్డి మాట మోడీ వింటారా?
X

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం పలు లక్షిత దాడులు జరిగినట్లు వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయంపై వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అయితే... గవర్నర్ నుంచి రియాక్షన్ రాకపోవడంతో ఢిల్లీ వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అవును... ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినట్లు పలు కథనాలు, వీడియోలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినా రియాక్షన్ రాలేదని.. అందువల్లే ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, అమిత్ షా లతోపాటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైసీపీ నాయకులతో పాటు ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు మొదలయ్యాయని అన్నారు. మరోపక్క రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, హింసాకాండపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు రియాక్ట్ అవ్వడం లేదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు!

ఇందులో భాగంగా ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ దాడులను తక్షణం అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు! ఇదే సమయంలో లక్షిత దాడులపై అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని బాధ్యులపై ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని ఆయన తన పిల్ లో కోరారు!

అదేవిధంగా... ఈ దాడులకు కారకులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన విన్నవించారు. ఇదే సమయలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తక్షణమే రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఈ పిల్ పై నేడు విచారణ జరగనుంది!

అయితే ఈ ఫిర్యాదులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత వరకూ రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. రాజ్యసభలో తమ అవసరం బీజేపీకి ఉందని విజయసాయి రెడ్డి తెలిపిన అనంతరం... ఆ పార్టీ నేతల ఫిర్యాదులను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా అనే చర్చా మొదలైంది!