ఎంపీగా పోటీ చేయనంటున్న వైవీ సుబ్బారెడ్డి....!
ఇక వైసీపీ తరఫున ఒంగోలు నుంచి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారు అని కొన్ని రోజులుగా ప్రచారం అయితే ఉంది.
By: Tupaki Desk | 15 Jan 2024 11:45 AM GMTవైసీపీ కీలక నేత ఉత్తరాంధ్రా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ అయిన వైవీ సుబ్బారెడ్డి సంక్రాంతి పండుగ వేళ తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోవడం లేదని ఆయన మీడియాకు చెప్పారు. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో వైవీ ఈ క్లారిటీ ఇవ్వడం విశేషం.
ఇక వైసీపీ తరఫున ఒంగోలు నుంచి వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారు అని కొన్ని రోజులుగా ప్రచారం అయితే ఉంది. మరో వైపు వైసీపీ నాలుగవ జాబితా రిలీజ్ ఒకటి రెండు రోజులలో ఉంది. అందులో ఒంగోలు ఎంపీ విషయం కూడా తేలిపోనుంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు.
అదే టైం లో వైవీ సుబ్బారెడ్డి కూడా పోటీకి రెడీ అని వార్తలు వచ్చాయి. ఇపుడు వైవీ పోటీ చేసేది లేదు అని చెప్పడంతో ఒంగోలు ఎంపీ అభ్యర్ధి ఎవరు అన్న చర్చ సాగుతోంది. మరో వైపు తాను పార్టీ కార్యక్రమాలను చూస్తున్నాను అని వైవీ చెప్పారు. తాను ఎన్నికల రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉన్నాను అని కూడా ఆయన చెప్పేశారు.
ఇక తన రాజకీయ భవిష్యత్తు మీద జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదిస్తాను అని ఆయన అంటున్నారు. ఇక వైసీపీలో మార్పులు చేర్పుల విషయంలో జగన్ ఒక స్పష్టత తో ముందుకు వెళ్తున్నారు అని వైవీ అంటున్నారు. ఈ విషయంలో అసంతృప్తులు సహజం అన్నారు. అవన్నీ మెల్లగా సర్దుకుంటాయని ఆయన చెప్పారు.
ఇక కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లడాన్ని ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు అవన్నీ వారి వ్యక్తిగత కారణాలు తప్ప మరేమీ కాదని తేల్చేశారు. వైసీపీలో కొత్త వారు మార్పు చేసిన ఇంచార్జిలు సిట్టింగుల మధ్య సర్దుబాటు జరిగి అంతా ఏకత్రాటి మీదకు రావాలంటే కొంత టైం పడుతుందని వైవీ అంటున్నారు. తొందరలొనే ఇలాంటివి అన్నీ సర్దుకుంటాయని ఆయన చెబుతున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్లలో అన్ని వర్గాలకు ఎంతో మేలు చేసిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ కూడా తమదే అన్నారు. తాము ప్రజలకు చేసిన మేలుని చూసే ఓటు వేయమని అడుగుతున్నామని అన్నారు.