Begin typing your search above and press return to search.

అమ్మాయి షర్మిలపై బాబాయ్‌ కీలక వ్యాఖ్యలు!

ఇదే కోవలో షర్మిలపై ఆమె బాబాయి, వైఎస్‌ విజయమ్మ మరిది అయిన వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 12:22 PM GMT
అమ్మాయి షర్మిలపై బాబాయ్‌ కీలక వ్యాఖ్యలు!
X

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని ఆ పార్టీ అధినేత్రి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా షర్మిల వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే జగన్‌ కేబినెట్‌ లో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ కు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా వారిని ప్రతిపక్షంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.

ఇదే కోవలో షర్మిలపై ఆమె బాబాయి, వైఎస్‌ విజయమ్మ మరిది అయిన వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.

వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌ లో విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. షర్మిల తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

ఎవరు కలిసినా, కూటములుగా వచ్చినా వైసీపీ భయపడబోదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మళ్లీ జగన్‌ సీఎం కావాలన్నారు. తమకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడబోనన్నారు.

వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం జరుగుతున్న మార్పుల గురించి స్పందిస్తూ.. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని చెప్పారు, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

షర్మిలతో సహా ఎవరు ఏ పార్టీ లో చేరినా, ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు జగన్‌ పైనే ఉన్నాయన్నారు. జగన్‌ కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే పేద కుటుంబాలు నష్టపోతాయని తెలిపారు. అందుకే ప్రజల ఆశీస్సులు తమతోనే ఉంటాయని స్పష్టం చేశారు. లోకేష్‌ నావ మునిగిపోయిందన్నారు. జాకీలు వేసి లేపుతున్నారని.. అయినా లేవడం లేదని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు.