Begin typing your search above and press return to search.

నితీష్ లో ప్రధాని నిద్ర లేచారా ?

అత్యవసర పరిస్థితులలో పోరాటం చేయడం ద్వారా ఆయనలోని నాయకుడు పుట్టుకొచ్చారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 6:45 PM GMT
నితీష్ లో ప్రధాని నిద్ర లేచారా ?
X

బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ లో ప్రధాని ఆశలు సజీవంగానే ఉన్నాయని అంటున్నారు. ఆయన ప్రధాని పదవితో తన రాజకీయ జీవితాన్ని సంపూర్ణంగా పండించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.నితీష్ కుమార్ ది సుదీర్ఘ రాజకీయం.

అత్యవసర పరిస్థితులలో పోరాటం చేయడం ద్వారా ఆయనలోని నాయకుడు పుట్టుకొచ్చారు. ఆ తరువాత 1985 నుంచి ఆయన చట్ట సభలకు ఎంపిక అవుతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. బీహార్ కి 19 ఏళ్ళుగా సీఎం గా ఉన్నారు.

ఆ రాష్ట్రానికి ఇంత సుదీర్ఘ కాలం సీఎం గా పనిచేసిన నేత మరొకరు లేరు. ఇక నితీష్ వయసు ఏడు పదులు దాటింది. తన రాజకీయ జీవిత చరమాంకంలో ప్రధానిగా చేసి అక్కడితో సంతృప్తి గా విరమించుకుందామని ఆయన చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.

దానికి తాజాగా పరిస్థితులు అనుకూలిస్తున్నాయా అంటే జేడీయూలో నితీష్ అనుచరులు మాత్రం ఇంత కంటే మంచి కాలం లేదు అనే అంటున్నారు. జేడీయూ నేత, మంత్రి జమాఖాన్ అయితే నితీష్ ప్రధాని అయి తీరుతారని లేటెస్ట్ గా బల్లగుద్దుతున్నారు.

కేంద్రమంత్రిగానే కాకుండా దాదాపు 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్ ఈ దేశానికి కచ్చితంగా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. అంతే కాదు మరో అడుగు ముందుకేసి ఆయనను ప్రధానిని చేయడంలో ప్రతిపక్షాలు కూడా మద్దతునిస్తాయని జమాఖాన్ పేర్కొనడమే కొసమెరుపు.

ఆయన ఇంకా దూరం వెళ్ళి మరో సంచలన ప్రకటన చేశారు. నితీశ్ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు మద్దతునిస్తాయని కూడా చెబుతున్నారు. అంతే కాదు కేవలం బీహార్ మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా నితీష్ కుమార్ ప్రధాని కావాలని కోరుకుంటోందని చెప్పారు.

నితీష్ కుమార్ ప్రధాని అయితేనే భారత్ ప్రగతి గణనీయంగా ముందుకు సాగుతుందని అన్నారు. పైగ మచ్చ లేని నేత అవినీతి మరక అంటని నాయకుడు అని కూడా జమాఖాన్ చెప్పరు. నితీష్ కి కుటుంబ నేపథ్యం సైతం లేదని అన్నారు

ఇవన్నీ పక్కన పెడితే నితీష్ కుమార్ ప్రధాని అంటే కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని జమాఖాన్ ప్రకటించడం తో ఇపుడు ఎన్డీయే కూటమిలో కలవరం రేగుతోంది. మూడోసారి ప్రధాని అయిన మోడీ ప్రభుత్వానికి అటు జేడీయూ ఇటు టీడీపీ రెండు ఊత కర్రలుగా ఉన్నాయి.

ఈ రెండు ఊతకర్రలలో ఏది లేకపోయినా సర్కార్ కుప్ప కూలుతుంది అన్నది తెలిసిందే. దాంతోనే ఇపుడు నితీష్ రాజకీయ తులాభారంగా మారారు అని అంటున్నారు. నితీష్ కుమార్ ని ముందు పెట్టి ఇండియా కూటమి ఏమైనా రాజకీయం చేయవచ్చు అన్నది విశ్లేషకులు అనుకుంటున్నదే.

ఇపుడు జేడీయూ కీలక నేత, మంత్రి జమాఖాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే దానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది బీహార్ లో అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి అధికారంలోకి రావాలని చూస్తోంది.

నితీష్ ని జాతీయ రాజకీయాలకు పంపించి బీహార్ ని తమ పరం చేసుకోవడానికి తెర వెనక ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయని కూడా అంటున్నారు. నితీష్ కుమార్ తీరు చూస్తే ఆయన చాలా పార్టీల మద్దతుని తీసుకున్నారు. గత అయిదేళ్లలో ఆయన ఇండియా కూటమి ఎన్డీయే కూటమి మధ్య తిరుగుతూనే ఉన్నారు.

ఆయన ప్రధాని మోడీని గౌరవిస్తున్నారు అదే సమయంలో ఆయన మనసులో ప్రధాని కోరిక ఉందని అంటున్నారు. అయితే నితీష్ మీద బీజేపీకి కూడా నమ్మకం లేదనే అంటున్నారు. ఇక బీహార్ లో ఈసారి జేడీయూ బీజేపీల మధ్య పొత్తు కుదురుతుందా అన్న మాట కూడా వినిపిస్తోంది.

మరో వైపు జమాఖాన్ చేసిన ప్రకటనలను బీజేపీ బీహార్ నేతలు గట్టిగానే ఖండిస్తున్నారు. దేశంలో ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ స్పష్టం చేశారు. ఇంకో వైపు చూస్తె బీహార్ లో బీజేపీ జేడీయూ కూటమి మధ్య మెల్లగా విభేదాలు పొడసూపుతున్నాయని అంటున్నారు. మాటల యుద్ధం మొదలైందని అది తీవ్ర స్థాయికి వెళ్తే ఏమిటి జరుగుతుంది అన్నది కూడా చూడాలని అంటున్నారు.

బీజేపీ సంగతి జేడీయూకు అర్థమైంది కాబట్టే బయటకు వచ్చేందుకు చూస్తోందని ప్రతిపక్ష ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ అంటున్నారు నితీశ్‌ను సీఎం సీటు నుంచి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రమైన ఆరోపణనే చేశారు. బీజేపీ కనుక ఇలాంటి పిచ్చి ప్రయత్నం ఏదైనా చేస్తే కేంద్రంలో ఎన్డీయే కి ఇస్తున్న మద్దతును జేడీయూ ఉపసంహరించుకుంటుందని ఆర్జేడీ చెప్పడం విశేషం. మొత్తానికి నితీష్ లోని ప్రధాని నిద్ర లేచారు అంటే ఎన్డీయే పుట్టే మునుగుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.