యావత్ యూరప్ కు ముప్పు.. ఉక్రెయిన్ అణు ప్లాంట్ లో మంటలు.. ఎవరి పని?
సరిగ్గా రెండేళ్ల కిందట ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో ఓ అణు విద్యుత్ ప్లాంట్ రోజంతా వార్తల్లో నిలిచింది.
By: Tupaki Desk | 12 Aug 2024 6:31 AM GMTసరిగ్గా రెండేళ్ల కిందట ఉక్రెయిన్-రష్యా యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో ఓ అణు విద్యుత్ ప్లాంట్ రోజంతా వార్తల్లో నిలిచింది. యూరప్ అంతటికీ ఆ ప్లాంట్ కీలకమైనదే కాదు.. యూరప్ లోనే అతి పెద్దది కూడా. అలాంటి ప్లాంట్ యుద్ధంలో చిక్కుకుంది. రెండు దేశాల సైన్యాలు దానిపై పట్టు కోసం రోజుల కొద్దీ పోరాడాయి. ఈ భీకర యుద్ధంలో చివరకు ఓ రోజు అణు ప్లాంట్ భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తాయి. ఆ ప్లాంట్ పేలిపోతుందంటూ కథనాలు వచ్చాయి. పరిస్థితి ఎక్కడ దాకా వెళ్లిందటే అంతర్జాతీయ అణు నిపుణుల టీమ్ వచ్చి ఉక్రెయిన్ లోని ఆ ప్లాంట్ ను సందర్శించింది. ఈ ప్లాంట్ కు ఏమైనా జరిగితే యావత్ యూరప్ నకూ ముప్పు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది.
జపోరిజియా అణు ప్లాంట్.. యూరప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్తు ప్లాంట్. ఇది ఉక్రెయిన్ లో ఉంది. అయితే, యుద్ధం మొదలైన కొన్ని నెలలకు రష్యా స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి రష్యా ఆధీనంలోనే కొనసాగుతోంది. తాజాగా ఈ ప్లాంట్ లో మంటలు పుట్టుకొచ్చాయి. రష్యా ఆధీనంలో ఉంది కాబట్టి.. ఇది ఆ దేశ సైనిక దళాల పనే అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇదే మాట చెబుతున్నారు. తమ దేశాన్ని బెదిరించేందుకు రష్యా ఈ పని చేసిందని ఆరోపించారు. రష్యా మాత్రం ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే జపోరిజియా ప్లాంట్ లో మంటలు రేగాయని చెబుతోంది. ప్లాంట్ కూలింగ్ టవర్‌పై డ్రోన్ దాడి జరిగిందనేది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణుల మాట.
హమ్మయ్య.. అణు లీక్ లేదు..
గతంలో జపోరిజియా ప్లాంట్ పై దాడి జరిగిన సమయంలో తలెత్తిన ఆందోళనలు ప్రపంచాన్ని కలవరపరిచాయి. దీంతో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ సిబ్బంది అక్కడే ఉంటున్నారు. తాజా ఘటనలో ఎలాంటి అణు పదార్థం లీక్ లేదని చెబుతున్నారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని కోరారు. కాగా, జపోరిజియా కూలింగ్ టవర్ లో ఆదివారమే భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. అక్కడ గవర్నర్లను నియమించింది. ప్లబిసైట్ నిర్వహించి తమ దేశంలో కలిపేసుకుంది. రష్యా నియమించిన గవర్నర్ యువ్ గెనీ బాలిటెస్కీ మాట్లాడుతూ తమ దళాలు జపోరిజియాలో సోమవారం నాటికి మంటలను పూర్తిగా ఆర్పివేశాయని తెలిపారు.
విద్యుదుత్పత్తి లేకున్నా..
2002 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. అనంతరం కీలకమైన జపోరిజియాను రష్యా ఆక్రమించింది. రెండేళ్లుగా విద్యుదుత్పత్తి కూడా జరగడం లేదు. రియాక్టర్లు అన్నిటినీ ఏప్రిల్ నుంచి కోల్డ్ షట్ డౌన్ లో ఉంచారు. మరోవైపు యుద్ధం మొదలైన రెండున్నరేళ్లలో తొలిసారిగా గత వారం ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి వెళ్లి దాడులు చేశాయి. దీనిని రష్యా కూడా అంగీకరించింది. ఇప్పుడు జపోరిజియా ప్లాంట్ ఉదంతం బయటకు వచ్చింది. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరి ఎక్కడకు వెళ్తుందోనన్న భయాలు తలెత్తుతున్నాయి. కాగా, ఇరాన్, హమాస్, హెజ్బొల్లాలు ఇజ్రాయెల్ పై కత్తి దూస్తున్న సమయంలోనే ఉక్రెయిన్ లోని రష్యా ఆధీనంలో ఉన్న జపోరిజియా ప్లాంట్ పై దాడి జరగడం మరింత ఉద్రికత్తకు దారితీసింది.