Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ చర్చలు భారత్ లో? ప్రపంచంలోనే కీలక పరిణామం

రెండున్నరేళ్లుగా జరుగుతోంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇంకా ముగింపునకు దారి కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 10:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ చర్చలు భారత్ లో? ప్రపంచంలోనే కీలక పరిణామం
X

రెండున్నరేళ్లుగా జరుగుతోంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇంకా ముగింపునకు దారి కనిపించడం లేదు.. ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు ఆయుధాలు సరఫరా చేస్తూ వస్తుండగా.. రష్యా చివరకు ఉత్తర కొరియా సైనికులనూ దింపుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 40 శాతం భూభాగాన్ని ఆక్రమించేసింది. ఇక జూలైలో భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఉక్రెయిన్ కూ వెళ్లి జెలెన్ స్కీతోనూ సమావేశం అయ్యారు మోదీ. ఇలా ఈ రెండు దేశాల్లోనూ పర్యటించిన ఏకైక నాయకుడు మోదీనే కావడం విశేషం.

శాంతి దూత మోదీ..?

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో తమది తటస్థ పక్షం కాదని.. శాంతి పక్షం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల సంఘర్షణలో మొదటినుంచి భారత్ సంయమనం పాటిస్తోంది. అంతేకాక ప్రపంచంలో పుతిన్ ను నిలువరించే శక్తి కేవలం మోదీకి మాత్రమే ఉందనేది అభిప్రాయం. దీనికితగ్గట్లే వీరిద్దరూ చాలా సన్నిహిత మిత్రుల్లా కనిపిస్తుంటారు. కాగా, యుద్ధాన్ని ఆపేందుకు తాము సాధ్యమైనంత సాయం చేస్తామని ఇప్పటికే మోదీ ప్రకటించారు.

మోదీ ఆపగలరు.. ట్రంప్ రెచ్చగొడతారు..

తాజాగా జెలెన్ స్కీ సైతం.. తమపై రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి భారత ప్రధాని మోదీకి ఉందన్నారు. భారత మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీకి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు భారత్‌ లోనే జరగొచ్చని కూడా జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. అయితే, రష్యా చౌకగా భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనం కొనుగోళ్లను ఆపితే రష్యా దూకుడుకు మోదీ కళ్లెం వేయగలరని మెలిక పెట్టారు. అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిస్తే మాత్రం రష్యాకు పట్టపగ్గాలు ఉండవని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తంచేశారు. ట్రంప్ రష్యాకు సైనిక సాయం చేస్తారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము రూపొందించిన విజయ ప్రణాళిక (విక్టరీ ప్లాన్‌)పై ప్రపంచ దేశాలు తక్షణం చర్చలు జరపాలని కోరారు.

యుద్ధ బాధిత దేశం.. శాంతి సందేశం

రష్యా చేస్తున్న దాడులతో 50 లక్షల కోట్లకు పైగా నష్టపోయిన ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. అంతగా యుద్ధ బాధిత దేశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థితో చర్చలు ఎంతో కీలకం అని అంటున్నారు జెలెన్ స్కీ. నవంబరులో రెండో ప్రపంచ శాంతి సదస్సుకు ముందు తమను తాము సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కాగా, ఉక్రెయిన్ తన మొదటి శాంతి శిఖరాగ్ర సమావేశాన్ని స్విట్జర్లాండ్‌లో నిర్వహించింది. సహజంగా రష్యా ఇందులో పాల్గొనలేదు. 92 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

నాటోకు ఆహ్వానమైనా ఇవ్వండి..

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి కారణమైన నాటో సభ్యత్వం ఇంకా ఉక్రెయిన్ కు దక్కనేలేదు. అయితే, ఆ సభ్యత్వాన్ని తాము వెంటనే కోరడం లేదని, ఆహ్వానం మాత్రమే అడుగుతున్నామని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఇటీవల నాటోలోని ఏడు దేశాలు ఉక్రెయిన్ కు సభ్యత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. యుద్ధం మొదలయ్యాక ఫిన్లాండ్ వంటి దేశాలకు నాటో సభ్యత్వం లభించినా ఉక్రెయిన్ కు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా, రష్యా ఇటీవలి కాలంలో అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది. తమకూ భారీగా ఆయుధాలు కావాలని పశ్చిమ దేశాలను జెలెన్ స్కీ కోరుతున్నారు. 5 వ్యూహాత్మక ఎయిర్‌ డిఫెన్స్‌ లను ఇస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హామీ ఇచ్చారు. దీన్ని ట్రంప్ తప్పుబట్టారు.