Begin typing your search above and press return to search.

రష్యా - ఉక్రెయిన్ వార్ లో కొత్త ట్విస్ట్..భూ మార్పిడికి జెలెన్ స్కీ ఓకే!

యుద్ధం మొదలు పెట్టటం తేలికే. కానీ.. ముగించటమే కష్టం. కొనసాగించటం మరింత క్లిష్టం. ఈ విషయం యుద్ధాలు జరుగుతున్న దేశాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 4:30 PM GMT
రష్యా - ఉక్రెయిన్ వార్ లో కొత్త ట్విస్ట్..భూ మార్పిడికి జెలెన్ స్కీ ఓకే!
X

రష్యా - ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపుతానని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఆ దిశగా అడుగులు వేయటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు.. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటన్నది చూస్తే..

యుద్ధం మొదలు పెట్టటం తేలికే. కానీ.. ముగించటమే కష్టం. కొనసాగించటం మరింత క్లిష్టం. ఈ విషయం యుద్ధాలు జరుగుతున్న దేశాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఒకప్పుడు తమలో భాగమైన ఉక్రెయిన్ ను వారం.. మహా అయితే పది రోజుల్లో తమ వశం చేసుకుంటామని భావించిన రష్యా అధినేత పుతిన్ యుద్ధానికి దిగటం..చూస్తుండగానే నెలలు కాదు.. సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితి. యుద్ధానికి కాలు దువ్విన రష్యా వెనక్కి తగ్గలేని పరిస్థితి. అలా అని.. ఇంతకాలం పోరాడిన ఉక్రెయిన్ వెనక్కి తగ్గటం నాట్ ఓకే. దీంతో.. వీరిద్దరికి ఆమోదయోగ్యమైన పవర్ ఫుల్ అధినేత ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి.

ఈ రెండు దేశాల మధ్య రాజీ కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నించటం.. అదంతగా వర్కువుట్ కాని పరిస్థితి. దీంతో.. ఆయన కామ్ అయ్యారు. కట్ చేస్తే.. అమెరికాకు రెండోసారి అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన ట్రంప్.. ఈ రెండు దేశాల మధ్య యుద్దాన్ని ముగించేందుకు సిద్ధమని చెప్పటమే కాదు.. రెండో రోజులక్రితం సంచలన వ్యాఖ్య చేశారు. ఉక్రెయిన్ ఏదో ఒక రోజు రష్యాలో భాగం కావొచ్చు.కాకపోవచ్చన్నారు. ఈ రెండు దేశాల మధ్య పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారిని త్వరలోనే కీవ్ కు పంపున్నట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం వచ్చే వారం మ్యానిచ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన ప్రకటన చేశారు. ఇన్నేళ్ల యుద్ధంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన స్వరం కొత్త రాగాన్ని ఆలపించింది. ‘రష్యాతో భూభాగ మార్పిడికి మేం సిద్ధం. అయితే.. రష్యా మా భూభాగాల్ని విడిచి పెడితే తమ అధీనంలో ఉన్న కుర్స్క్ ను వారికి అప్పగిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఏ భూభాగాల్ని తిరిగి తీసుకుంటారన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. అన్ని భాగాలు ముఖ్యమైనవని.. ఏవి తిరిగి తీసుకోవాలనే అంశంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొనటం గమనార్హం. అంతేకాదు.. తాము అనుకున్నది జరగాలంటే రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు క్రషి చేయాలని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక్కడే జెలెన్ స్కీ నుంచి మరో ఆసక్తికర వ్యాఖ్య బయటకు వచ్చింది.

తమ రెండు దేశాల మధ్య చర్చలకు అనుకూలంగా అమెరికా ప్రయత్నిస్తే.. ఆ దేశానికి సంబంధించిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటామన్నారు. తమ వద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయన్నారు. ఇలా చేస్తే.. ఉక్రెయిన్ లో ఉద్యోగాల్ని క్రియేట్ చేయొచ్చన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక.. ట్రంప్ విషయానికి వస్తే.. ఇటీవల తాను రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన వైనాన్ని వెల్లడించటం తెలిసిందే. యుద్ధం కారణంగా అమాయక ప్రజలు చనిపోవాలని ఆపాలని పుతిన్ కోరుకుంటున్నట్లుగా వెల్లడించిన ట్రంప.. ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సాయానికి 500 మిలియన్ డాలర్ల డీల్ ను ప్రతిపాదించగా.. అందుకువారు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి ట్రంప్ అనుకున్నట్లే రెండు దేశాల మధ్య యుద్ధానికి బ్రేకులు వేయటమే కాదు.. అందుకు ప్రతిఫలంగా అరుదైన ఖనిజాలు.. భారీగా వ్యాపారాన్ని చేసుకునేలా సీన్ ను సిద్ధం చేస్తున్నారని చెప్పక తప్పదు. ట్రంపా..మజాకానా?