యుద్ధం ఆపేస్తాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక షరతు
యుద్ధం జరగటానికి కారణమైన రష్యా సైతం ఈ యుద్ధం కారణంగా సాధించిన దాని కంటే.. పోగొట్టుకున్నదే ఎక్కువని చెప్పాలి.
By: Tupaki Desk | 30 Nov 2024 6:28 AM GMTఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండున్నరేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ కుదులే కావటమే కాదు.. కుదురుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు.. కయ్యానికి కాలుదువ్వి.. యుద్ధం జరగటానికి కారణమైన రష్యా సైతం ఈ యుద్ధం కారణంగా సాధించిన దాని కంటే.. పోగొట్టుకున్నదే ఎక్కువని చెప్పాలి.
ఎవరెన్ని చెప్పినప్పటికి.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు బ్రిటన్ కు చెందిన స్కై మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ప్రపోజల్ కు ఓకే చెబితే.. యుద్ధాన్ని ముగించే వీలుందనన వాదనను వినిపించారు.
అయితే.. జెలెన్ స్కీ ప్రతిపాదించిన ప్రతిపాదన ఆచరణ అంత తేలికైన విషయం కాదు. కారణం.. కీవ్ ఆధీనంలో ఉన్న తమ భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంతకూ జెలెన్ స్కీ ఏం చెప్పారన్నది చూస్తే.. ‘‘యుద్ధాన్ని ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తానన్న హామీ ఇవ్వాలి. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం దేశాన్ని (రష్యా అధీనంలో ఉన్న ప్రాంతంతో కలిపి) నాటోలో చేర్చుకోవాలి’’ అంటూ పేర్కొన్నారు.
ఇలా జరిగితే.. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాన్ని దౌత్యపరంగా తిరిగి తాము సాధించుకునే వీలు తన ప్రపోజల్ ద్వారా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇంతకాలం యుద్దం చేసిన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రపోజల్ కు ఒప్పుకుంటుందా? అన్నది ప్రశ్న. ఉక్రెయిన్ భద్రత వరకు జెలెన్ స్కీ చూసుకుంటారు? మరి ఏం ఆశించి.. ఇంతకాలం రష్యా యుద్దం చేసింది? అన్న అంశాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్రపోజల్ కు నాటో కూటమి ఒప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే.. ఉక్రెయిన్ ను తమ కూటమిలో చేర్చుకుంటామన్న హామీని ఇప్పటివరకు కూటమిలోని ఏ దేశం హామీ ఇవ్వలేదు. అదే సమయంలో ఉక్రెయిన్ లోని కొంతభాగాన్ని చేర్చుకుంటామన్న అంశానికి జెలెన్ స్కీ ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. ఉక్రెయిన్ అంటే తమ భూభాగం మొత్తమే తప్పించి.. రష్యా అక్రమించుకున్నది తమది కాదంటే ఆయన ఒప్పుకోవటానికి సిద్ధంగా లేరు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళలో.. ఉక్రెయిన్ కు తాము ఇచ్చిన దీర్ఘశ్రేణి క్షిపణులను మాస్కోపై వాడుకోవచ్చని బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరే స్థాయికి వెళుతుందన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళలో.. జెలెన్ స్కీ నుంచి వచ్చిన ప్రపోజల్ ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.