Begin typing your search above and press return to search.

ట్రంప్ తో లొల్లి.. జెలెన్ స్కీ హీరో అయిపోయాడే!

ఇతడి ధైర్య సాహసానికి ప్రపంచమే ఆశ్చర్యపోగా.. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల్లో అతడికి మద్దతు పెరగడం విశేషంగా చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   8 March 2025 3:00 AM IST
ట్రంప్ తో లొల్లి.. జెలెన్ స్కీ హీరో అయిపోయాడే!
X

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. పెట్టుకుంటే అగ్రరాజ్యపు అధిపతితోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అదే చేశాడు. అతడు చేసింది కరెక్ట్ నా? రాంగ్ నా? అన్నది పక్కనపెట్టి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనే ఏకంగా వైట్ హౌస్ లో గొడవ పెట్టుకొని పాపులర్ అయిపోయాడు. ఇతడి ధైర్య సాహసానికి ప్రపంచమే ఆశ్చర్యపోగా.. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల్లో అతడికి మద్దతు పెరగడం విశేషంగా చెప్పొచ్చు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్ వేదికగా జరిగిన సమావేశం తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ట్రంప్ మాట్లాడుతూ జెలెన్‌స్కీ ప్రజల మద్దతు కోల్పోయారని, ఆయన నియంతలాగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ ప్రజాదరణపై పలు సంస్థలు అభిప్రాయ సేకరణలు నిర్వహించాయి.

-జెలెన్‌స్కీ ప్రజామోదంలో 10% పెరుగుదల

కీవ్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషియాలజీ నిర్వహించిన పోల్ ప్రకారం, ఉక్రెయిన్‌లో 67% మంది ప్రజలు జెలెన్‌స్కీకి మద్దతు తెలిపినట్లు వెల్లడైంది. ట్రంప్‌తో సమావేశానికి ముందు ఆయన మద్దతుదారుల శాతం 57% కాగా, సమావేశం అనంతరం అది 10% పెరిగింది. ట్రంప్ ఉన్మాదపూరిత వ్యాఖ్యలు, ఉక్రెయిన్ అధ్యక్షుడిని అవమానించే విధంగా మాట్లాడటం ప్రజల్లో అసంతృప్తిని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జెలెన్‌స్కీ మద్దతుదారుల సంఖ్య పెరగడానికి కారణమని తెలుస్తోంది.

-ట్రంప్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ ప్రజల ప్రతిస్పందన

ట్రంప్ జెలెన్‌స్కీపై చేసిన ఆరోపణలు ఉక్రెయిన్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రష్యా ఆక్రమణతో దేశం దెబ్బతిన్నా, తమ నాయకుడిపై విదేశీ నాయకులు ఇలా విమర్శలు చేయడం ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెలెన్‌స్కీ నేతృత్వాన్ని ప్రజలు సమర్థిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

-శాంతి చర్చలపై వివాదం

ట్రంప్-జెలెన్‌స్కీ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిష్కార చర్చల గురించే జరిగింది. ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధానికి కారణమని, సకాలంలో సంధి చేసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. అలాగే, జెలెన్‌స్కీకి ప్రజాదరణ 4% మాత్రమే ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను జెలెన్‌స్కీ ఖండించారు. ప్రజలు తన నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారని, ఉక్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి తాను ఎప్పటికీ వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ ప్రజాదరణ పెరగడం ఆసక్తికరంగా మారింది. అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో ఈ సంఘటన ప్రభావం చూపుతుందా లేదా అనేది మరింత కాలం గమనించాల్సిన అంశం. అయితే, ప్రజలు తమ నాయకుడి పట్ల మద్దతు పెంచుకోవడం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెబుతున్నారు.