ట్రంప్ పై జెలెన్ స్కీ మనసులో మాట... రష్యా నోట అణుక్షిపణి తూటా!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 July 2024 6:30 AM GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పుల ఘటన అనంతరం ఈ ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సమయంలో అమెరికా మిత్రదేశాలు, శత్రుదేశాల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన చర్చ ట్రంప్ పై కాల్పుల ఘటనకు ముందు, తర్వాత గా మారిందన్నా అతిశయోక్తి కాదేమో. ఈ కాల్పుల ఘటన అనంతరం ట్రంప్ విజయవాకాశాలు భాగా మెరుగుపడ్డాయంటూ పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. మరోపక్క ఈ ఘటన అనంతరం ట్రంప్ దూకుడు పెంచారని అంటున్నారు. ఈ సమయంలో... ట్రంప్ గెలుపు, తదనంతర పరిణామాలపై జెలెన్ స్కీ స్పందించారు.
ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. ఆయనతో కలిసి పనిచేయడం కష్టమే అని జెలెన్ స్కీ అన్నారు. ఇదే సమయంలో... ఇటీవల యూఎస్ రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధంపై పట్టించుకోమని అన్నారు. దీనిపైనా స్పందించిన జెలెన్ స్కీ... వారు తమ గురించి పట్టించుకోకపోయినప్పటికీ, తాము మాత్రం యూఎస్ తో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
అణు క్షిపణులను మోహరిస్తామంటున్న రష్యా!:
మరోపక్క 2026 నుంచి జర్మనీలో అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణుల మొహరింపు ప్రారంభం అవుతుందని వాషింగ్టన్, బెర్లిన్ లు ఇటీవల సంయుక్తంగా ప్రకటించిన నేపథ్యంలో.. రష్యా స్పందించింది. ఇందులో భాగంగా... జర్మనీలో అమెరికా దీర్ఘ శ్రేణి క్షిపణులను మొహరిస్తే... తాము అణు క్షిపణులను మొహరించేందుకు సైతం వెనుకాడబోమని రష్యా హెచ్చరించింది.
ఈ మేరకు రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ స్పందిస్తూ... క్షిపణులను మొహరించడం సహేతుకమని జర్మనీ ప్రభుత్వ అధికారులు భావిస్తే... తాము కూడా ప్రతీకార చర్యలతో ప్రతిస్పందిస్తమని సెర్గీ పేర్కొన్నారు. ఇదే సమయంలో... నాటో దేశాల సామర్థ్యాల దృష్ట్యా... ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ఆయుధాలను మొహరించాలనే దానిపై రష్యా ఎలాంటి పరిమితులు విధించుకోకుండా ప్రతిదాడులు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.