ఆకలి కేకల దేశంలో.. ప్రాణాలకు 'బిక్ష'
ఎంతగా అంటే.. డబ్బులను కట్టలుకట్టలుగా పోసి రొట్టె ముక్క కొనుగోలు చేసేంత.
By: Tupaki Desk | 2 Jan 2025 1:30 AM GMTఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో పూర్తిగా నలిగిపోయిన నల్ల వారి దేశం అది.. గొప్ప స్వాతంత్ర్య పోరాటంతో బానిస సంకెళ్లు తెంచుకున్న దేశం అది.. కానీ, ఏ స్వాతంత్ర్యం అయితే తీసుకొచ్చాడో ఆ వీరుడే నియంతగా మారాడు.. తన ఆర్థిక విధానాలతో దేశాన్ని వెనక్కు నడిపించాడు. ఇది దేశంలో ఆకలి కేకలకు దారితీసింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. కరెన్సీ విలువ పడిపోయింది. ఎంతగా అంటే.. డబ్బులను కట్టలుకట్టలుగా పోసి రొట్టె ముక్క కొనుగోలు చేసేంత. ఆహారం దొరక్క ఏనుగులను చంపుకొని తినేంత.
క్రికెట్ అభిమానులకు జింబాబ్వే దేశం బాగా పరిచయమే. ఒకప్పుడు భారత్ కు సవాలు కూడా విసిరిన జట్టు అది. అంతెందుకు..? మొన్నటి టి20 ప్రపంచ కప్ గెలుపు అనంతరం భారత జట్టు వెళ్లిన టూర్ జింబాబ్వేనే. కానీ, ఆ దేశ జట్టు ప్రస్తుతం వెనుకటి అంత బలంగా ఏమీ లేదు. ఓ సాధారణ జట్టుగా మారిపోయింది.
ఇక పైన చెప్పుకొన్న నియంత జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో రొడీషియాగా ఉన్న జింబాబ్వే ఆ తర్వాత పేరు మార్చుకుంది. కాగా, బ్రిటిష్ పాలనపై ముగాబే 1960ల నుంచి గెరిల్లా విముక్తి పోరాటం సాగించారు. 1980లో స్వాతంత్ర్యం సాధించారు. ఆ వెంటనే ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. తర్వాత అధ్యక్షుడు కూడా అయ్యారు. 2017 వరకు ఈయన దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. స్వాతంత్య్రం అనంతరం ఆఫ్రికా ఖండంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన జింబాబ్వే ముగాబే పాలనలో 1990లలో క్షీణ దశలోకి ప్రవేశించింది.
కాగా, 2013లో ముగాబే 89 ఏళ్ల వయసులో ఏడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017 వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆయనకు వందేళ్లు. ముగాబే హయాంలో చేపట్టిన భూ సంస్కరణలు చివరకు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. దేశ జనాభాలో ఒక శాతమే ఉన్న తెల్లవారి దగ్గర భూమి అపారంగా ఉండడంతో ఆయన సంస్కరణలు చేపట్టి నల్లవారికి పంచారు. కానీ, ఇందులో అనేక లోపాలు చోటుచేసుకున్నాయి.
జింబాబ్వే అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమర్సన్ నంగాగ్వా ఉన్నారు. ఆయన తాజాగా మరణ శిక్ష రద్దు నిర్ణయంపై సంతకం చేశారు. ఇప్పటికే దేశంలో 60 మందికి మరణ శిక్ష పడగా..అది జీవిత ఖైదుగా మారనుంది. జింబాబ్వేలో ముగాబే హయాంలో.. 2005లో మరణ శిక్ష రద్దుపై చర్చ మొదలైంది. సరిగ్గా అది 20 ఏళ్ల తర్వాత సాకారమైంది. నిరసనలు వ్యక్తం అవుతున్నా జింబాబ్వే కోర్టులు మరణ శిక్ష విధిస్తున్నాయి. ఇప్పుడు ఆ శిక్ష రద్దయింది.