ఎన్డీఏ భేటీకి జనసేనకు ఆహ్వానం...టీడీపీకి షాక్?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల పంచాయతీ
By: Tupaki Desk | 14 July 2023 4:24 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల పంచాయతీ బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఏపీ బీజేపీ నేతల్లో ఒకరు మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయంటే... ప్రస్తుతానికి జనసేనతోనే ముందుకు అన్నట్లుగా మరొకరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతీయ స్థాయిలో అధికార బీజేపీ కాంగ్రెస్ సారథ్యంలోని సుమారు 24 పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించుకోకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ ఈ నెల 17 18న సమావేశం అవుతున్నాయని తెలుస్తుంది. ఇదే సమయంలో ఈ నెల 18న ఎన్డీఏ మిత్రపక్షాలతో సమావేశానికి బీజేపీ నిర్ణయించింది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి బీజేపీ తరుపున జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిందని తెలుస్తుంది.
అవును... జాతీయ స్థాయిలో మరుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉండి దూరమైన పార్టీలతో పాటు.. భావ సారూప్యత కలిగిన ఇతర పార్టీలతో ఈ నెల 18న ఢిల్లీలో సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి ఇప్పటికే పలు పార్టీలకు ఆహ్వానాలు అందాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ పాతమిత్రుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కూడా అధికారాన్ని పంచుకున్నాయి! అయినప్పటికీ... ఇప్పటివరకూ టీడీపీకి ఆహ్వానం అందలేదని అంటున్నారు!
అన్నాడీఎంకే తమిళ్ మనీలా కాంగ్రెస్ పీఎంకే లోక్ జనశక్తి హిందుస్తానీ ఆవామ్ మోర్చాకు ఆహ్వానాలు పంపారని.. శిరోమణి ఆకాలీ దల్ ను ఆహ్వానించారని అంటున్నారు. ఇదే సమయంలో... మహారాష్ట్రలోని శివసేనతో పాటు... ఈమధే ఎన్సీపీ నుంచి చీలిన వర్గానికి కూడా బీజేపీ ఆహ్వానాలు అందాయని అంటున్నారు. ఈ క్రమంలోనే... తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిందని అంటున్నారు.
దీంతో... తెలంగాణతో ఎవరితోనూ పొత్తు లేదు.. ఏపీ విషయానికొచ్చేసరికి జనసేనతో మాత్రమే కలిసి వెళ్లబోతున్నామని చెప్పే ప్రయత్నమో భాగంగా ఇలా చేసి ఉంటారని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమావేశానికి పవన్ తో పాటు మనోహర్ కూడా హాజరవుతారని తెలుస్తుంది!
మరోపక్క టీడీపీతో రెండు రాష్ట్రాల్లో పొత్తు ద్వారా తెలంగాణలో తమకు నష్టం జరుగుతోందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. పలు టీవీ చర్చా కార్యక్రమాల్లో ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారని అంటున్నారు. దీంతో... తెలంగాణ బీజేపీ నేతల రిక్వస్ట్ మేరకే టీడీపీకి ఆహ్వానం అందలేదా.. లేక మోడి-అమిత్ షా లకే బాబుపై నమ్మకం లేదా అనేది తెలియాల్సి ఉందని అంటున్నారు విశ్లేషకులు!
ఏది ఏమైనా... ఏపీ రాజకీయాల్లో మరిముఖ్యంగా పొత్తుల పంచాయతీకి సంబంధించి ఇది కీలక పరిణామమని ఈ సమయంలో జనసేన తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మరింత ఆసక్తికరమైన విషయమని అంటున్నారు పరిశీలకులు!!