Begin typing your search above and press return to search.

ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ దోచేశారా? రేవంత్ ఏం చెప్పారు?

ఉచిత విద్యుత్ మీద తాను చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా కాకుండా.. ఎడిట్ చేసి తొండి ఆట ఆడుతున్నట్లుగా రేవంత్ విరుచుకుపడ్డారు.

By:  Tupaki Desk   |   14 July 2023 5:53 AM GMT
ఉచిత విద్యుత్ పేరుతో కేసీఆర్ దోచేశారా? రేవంత్ ఏం చెప్పారు?
X

సంచలన వ్యాఖ్యల కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే టీపీసీసీ రథసారధి.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన నోటి నుంచి వ్యాఖ్యల కు అధికార బీఆర్ఎస్ ఎంతలా ఉలిక్కిపడిందన్న విషయం.. ఆయన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు చెప్పకనే చెప్పేశాయి.

ఉచిత విద్యుత్ మీద తాను చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా కాకుండా.. ఎడిట్ చేసి తొండి ఆట ఆడుతున్నట్లుగా రేవంత్ విరుచుకుపడ్డారు. 24 గంటలు ఫ్రీ కరెంటు అక్కర్లేదన్న రేవంత్.. తన వాదన ను మరింత స్పష్టంగా వినిపిస్తూనే.. మరోవైపు ఉచిత విద్యుత్ పేరు తో కేసీఆర్ సర్కారు ఎంతలా దోపిడీకి తెర తీసిందో వివరించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

రైతుల కు ఉచిత విద్యుత్తు కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా కేసీఆర్ సర్కారు చెబుతున్నప్పటికీ.. వాస్తవం లో మాత్రం చిన్న.. సన్నకారు రైతుల కు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. నేతల ఫాంహౌస్ లు.. భూములు ఉన్న ప్రాంతాల్లో మాత్రం 10-12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. రాష్ట్రం లో ఎక్కడా 12 గంటల కు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు రూ.16వేలకోట్లు ఖర్చు ఎలా చేస్తున్నట్లు? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఉచిత విద్యుత్ పేరు తో కేటాయించిన నిధుల్లో.. చెప్పిన 24 గంటల కు బదులుగా 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు మిగిలిన రూ.8 వేల కోట్ల మాటేంటి? అంటూ నిలదీస్తున్నారు రేవంత్. ఉచిత విద్యుత్ పథకం కింద కేటాయించిన నిధుల్లో రూ.8వేల కోట్లను సీఎం కేసీఆర్ దోపిడీ చేస్తున్నట్లుగా మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు ఇలా ఉంటే.. ఆయన వాదన లో పస ఉందన్న విషయాన్ని మరో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధారాల తో మీడియా ముందుకు వచ్చేశారు.

విద్యుత్ సరఫరా కు సంబంధించిన లాగ్ బుక్ లను ప్రదర్శించిన కోమటిరెడ్డి రాష్ట్రం లో రైతుల కు 24 గంటల ఉచిత విద్యుత్ ను సరఫరా చేయట్లేదని స్పష్టం చేశారు. అందుకు సాక్ష్యంగా లాగ్ బుక్ లను ప్రదర్శించారు. దీంతో.. ఉలిక్కిపడిన విద్యుత్ శాఖ.. ఆ వెంటనే సబ్ స్టేషన్లలో ఉండే లాగ్ బుక్ లను సంబంధిత ఏఈల కు ఇచ్చేయాలని.. వారి కంట్రోల్ లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వం చెప్పినట్లుగా 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే.. లాగ్ బుక్ లను అందుబాటు లో ఉంచకుండా ఎందుకు చర్యలు తీసుకున్నారన్న కోమటిరెడ్డి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా రైతుల కు 24 గంటలు ఉచిత విద్యుత్ అంటూ కేసీఆర్ చెబుతున్న గొప్పలు.. వాస్తవానికి మధ్య తేడా ఉందన్నట్లుగా చేస్తున్న కాంగ్రెస్ నేతల వాదనలు రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని రగల్చటం ఖాయమ ని చెబుతున్నారు.