వివేకా హత్య కేసు... సుప్రీంలో కీలక పరిణామం!
ఇందులో భాగంగా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
By: Tupaki Desk | 19 Nov 2024 9:39 AM GMTతీవ్ర సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం విచారణ జరిపింది.
అవును... వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించారు. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారని.. కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని ఈ సందర్భంగా లూథ్రా పేర్కొన్నారు! ఇదే సమయంలో... ఈ కేసులో అప్రూవర్ గా మారిన శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించాడని లూథ్రా.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు!
ఇలా ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రహావితం చేయడానికి ప్రయతించారని.. డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని.. ఆయన రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూథ్రా కోర్టుకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ తో పాటు చైతన్య రెడ్డిని ప్రతివాదులుగా చేర్చాలని కోరారు.
దీంతో... సునీత తరుపు న్యాయవాది లూథ్రా వాదనలను సమర్థించిన సీజేఐ ధర్మాసనం ఇద్దరినీ ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది! దీంతో.. ఎంపీ అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.
ఇదే సమయంలో... వివేకా హత్యకేసులో సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఈ ముగ్గురూ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.