Begin typing your search above and press return to search.

సహజీవనానికి డీల్.. బ్రేకప్ కు నోటీస్ రూల్.. ఎక్కడంటే?

సోషల్ మీడియాలో భారీ చర్చగా మారిన తాజా ఉదంతంలోకి వెళితే.. ముంబయికి చెందిన ఒక జంట తాజాగా కోర్టును ఆశ్రయించింది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 6:30 AM GMT
సహజీవనానికి డీల్.. బ్రేకప్ కు నోటీస్ రూల్.. ఎక్కడంటే?
X

రోజులు మారుతున్నాయి. అది కూడా.. ఊహించనంత వేగంగా. మారుతున్న సామాజిక పరిస్థితులకు తగ్గట్లు.. బంధాలు.. అనుబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆలోచించేందుకు కూడా సాహసం చేయలేని అంశాలు ఇప్పుడు రియాల్టీలోకి రావటమే కాదు.. వాటికి సంబంధించిన వివరాలు వార్తాంశాలుగా మారుతున్నాయి. సహజీవనం ఇప్పటికి గుట్టుగా జరిగిపోతున్నాయి. అలాంటిది.. సహజీవనం చేసే జంట చేసుకున్న ఒప్పందం.. అందుకు సిద్ధం చేసుకున్న అగ్రిమెంట్ మాత్రమే కాదు.. ఆ క్రమంలో రిలేషన్ బ్రేకప్ వేళ ఏమేం చేయాలన్న అంశాల్ని రూల్ గా రాసుకోవటం చూస్తే.. ఎక్కడికి వెళ్లిపోతున్నామన్న భావన కలుగక మానదు.

సోషల్ మీడియాలో భారీ చర్చగా మారిన తాజా ఉదంతంలోకి వెళితే.. ముంబయికి చెందిన ఒక జంట తాజాగా కోర్టును ఆశ్రయించింది. తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా పేర్కొంటూ ఒక వ్యక్తిపై కేసు పెట్టింది. దీనిపై అతను ఊహించని ఒక డాక్యుమెంట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో షేర్ కావటంతో ఇప్పుడీ ఉదంతం షాకింగ్ గా మారింది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

29 ఏళ్ల యువతి పెద్ద వయస్కులకు కేర్ టేకర్ గా పని చేస్తోంది. ఇక.. లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 ఏళ్ల వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. మిగిలిన వారికి భిన్నంగా వారు ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చెబుతున్నారు. అయితే.. అదంతా ఫేక్ డాక్యుమెంట్ గా ఆమె వాదిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి తన వద్ద ఉన్న అగ్రిమెంట్ కాపీని బయటకు తీసి కోర్టు ముందు పెట్టారు.

అందులో.. పలు అంశాల్ని ఒప్పందాలుగా రాసుకున్నారు. వాటిలో కొన్నింటిని చూస్తే..

- ఏడాది పాటు కలిసి ఉండాలన్న నిర్ణయం

- కలిసి ఉన్నప్పుడు పరస్పరం ఎవరూ లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు

- ఒకవేళ ఎవరికైనా ఎదుటి వ్యక్తి నచ్చకపోతే నెల రోజుల ముందు నోటీసు పీరియడ్ ఇచ్చి విడిపోవచ్చు.

- ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే.. అందుకు అతడు బాధ్యుడు కాదు.

ఇలా పలు పాయింట్లతో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. బంధువుల రాకపోకలపైనా ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా సదరు అగ్రిమెంట్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కోర్టు ముందుకు తీసుకొచ్చారు. దీంతో.. ఈ కేసు వివరాలు బయటకు వచ్చాయి. అయితే.. ఈ అగ్రిమెంట్ ఫేక్ అని అమ్మాయి తరఫు లాయర్ వాదిస్తుంటే.. అదంతా ఒరిజినల్ అంటూ అబ్బాయి తరఫు లాయర్ వాదిస్తున్నారు. మొత్తంగా ఈ అగ్రిమెంట్ కాపీ నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద చర్చకు తెర తీసిందని చెప్పాలి.