ఆలియా.. జిగ్రాతో గొడవేంటి?
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 13 Oct 2024 5:50 AM GMTబాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓవైపు కమర్షియల్ చిత్రాల్లో యాక్ట్ చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా జిగ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆలియాతో పాటు యంగ్ హీరో వేదాంగ్ రైనా, సౌత్ నటుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు కనిపించారు.
బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వయాకామ్ స్టూడియోస్, ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన జిగ్రా.. అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. అక్కాతమ్ముళ్ల కధలతో ఇప్పటికే చాలా సినిమాలు రాగా.. జిగ్రా రొటీన్ గా అనిపించిందని కొందరు రివ్యూస్ ఇచ్చారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా నార్త్ లో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది.
ఇదంతా పక్కన పెడితే.. జిగ్రా రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ లోని జోధ్ పుర్ లో జిగ్రా పేరుతో కోచింగ్ సెంటర్ నడుపుతున్న ఓ వ్యక్తి.. స్థానిక కమర్షియల్ కోర్టును ఆశ్రయించారు. జిగ్రా అనేది తన రిజిస్టర్ ట్రేడ్ మార్క్ అని, మేకర్స్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించారు. విచారణ జరిపిన కోర్టు.. సినిమా రిలీజ్ పై టెంపరరీ స్టే విధించింది. దీంతో ధర్మ ప్రొడక్షన్స్.. హైకోర్టు మెట్లెక్కింది. తాము ఎలాంటి ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు కారణమయ్యే వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనడం లేదని తెలిపింది.
విచారణ జరిపిన జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటి, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ బెంచ్.. జిగ్రా ఎటువంటి ట్రేడ్ మార్క్ హక్కులను ఉల్లంఘించలేదని నిర్ధరించింది. జిగ్రా పేరుతో ధర్మ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి వ్యాపారం చేయడం లేదని తెలిపింది. కేవలం సినిమాకు పేరు పెట్టిందని వ్యాఖ్యానించింది. అందుకే ట్రేడ్ మార్క్ చట్టాలు ఉల్లంఘించినట్లు నిర్థరించలేమని చెప్పింది. కమర్షియల్ కోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది.
అక్టోబరు 16వ తేదీకి మిగతా విచారణను వాయిదా వేసింది రాజస్థాన్ హైకోర్టు. అయితే స్టేని ఎత్తివేయడంతో జోధ్ పుర్ లో సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత తమ సిటీలో జిగ్రా మూవీ రిలీజ్ అవ్వదేమోనని కాస్త కలవరపడ్డ ఆలియా ఫ్యాన్స్.. ఆ తర్వాత హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఖుషీ అయ్యారు. చివరకు సినిమాను తమ నగరంలోనే చూశారు. మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.