అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు... సుప్రీం కీలక నిర్ణయం!
మహిళ వక్షోజాలను తాకడం, పైజామా నాడా లాగడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 March 2025 11:00 AMమహిళ వక్షోజాలను తాకడం, పైజామా నాడా లాగడం అత్యాచార నేరం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తుంది. దీనిపై పలువురు సీనియర్ లాయర్లు, మహిళలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు స్పందించింది.
అవును... మహిళ ఫ్యాంటు నాడా పట్టుకుని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార నేరం కిందరు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, సామాన్యుల వరకూ మీడియా ముందు, సోషల్ మీడియా వేదిక స్పందిస్తున్నారు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగా... దీనిపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి స్పందించారు. ఈ తీర్పు ఏమాత్రం సమ్మతం కాదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. ఇటువంటి తీర్పులతో సమాజంలో తప్పుడు సంకేతాలు, సందేశాలు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. ఇందులో భాగంగా... ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా... ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అదేవిధంగా... ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కాగా... కాగా... 2021 నవంబర్ లో ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్ గంజ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి బందువుల ఇంటి నుంచి గ్రామానికి నడుస్తూ వెళ్తోంది. ఈ సమయంలో అటువైపు బండిపై వస్తున్న అదే గ్రామానికి చెందిన యువకులు.. ఆమెను గ్రామంలో వదిలిపెడతామని చెప్పి బండి ఎక్కించుకున్నారు.
మార్గమధ్యలో ఆమెను కిందకు దింపి.. ఆ చిన్నారి వక్షోజాలు పట్టుకుని.. కల్వర్టు కిందకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు! ఇదే సమయంలో ఆమె పైజామా నాడాలు కట్ చేసి ఫ్యాంటు కిందకు లాగే ప్రయత్నం చేశారు! ఈ సమయంలో బాలిక హాహాకారాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో.. ఆ యువకులు అక్కడ నుంచి పారిపోయారు.
దీంతో.. విషయం తెలుసుకొన్న బాలిక తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులపై కేసు పెట్టారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా.. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా స్పందిస్తూ... నిందితులపై మోపబడిన ఆరోపణలు, కేసు వాస్తవాలు, ఈ కేసులో అత్యాచారయత్న నేరంగా పరిగణించబడవని అన్నారు.
బాలికపై అత్యాచారయత్నం చేయాలని ప్రయత్నించడానికి, నేరం చేయడానికి వ్యత్యాసం ఉంటుందని వివరించారు! బాధితురాలి వక్షోజాలు తాకారు, పైజామా నాడాలు కట్ చేసి, ఆమెను కల్వర్టు కిందకు లాగేందుకు ప్రయత్నించారే తప్ప.. ఆమెపై వారు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని చెప్పే సాక్ష్యాలు లేవని అన్నారు! దీంతో.. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి!