పేకాట, రమ్మీ... స్కిల్ గేమ్స్!
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పేకాట, రమ్మీ వంటి వాటిని ‘‘స్కిల్ గేమ్స్’’ గా హైకోర్టు పేర్కొనడం విశేషం.
By: Tupaki Desk | 5 Sep 2024 10:04 AM GMTఅలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పేకాట, రమ్మీ వంటి వాటిని ‘‘స్కిల్ గేమ్స్’’ గా హైకోర్టు పేర్కొనడం విశేషం. ఈ మేరకు పేకాట, రమ్మీలను నైపుణ్యం ఉన్న గేమ్స్ గా పేర్కొంటూ తాజా తీర్పును వెలువరించింది. అలాగే ఈ ఆటలకు సంబంధించిన అనుమతులను రద్దు చేసేటప్పుడు ఖచ్చితమైన సాక్ష్యాలు ఉండాల్సిందేనని తెలిపింది.
ఆగ్రా సిటీ కమిషనరేట్ కార్యాలయం గేమింగ్ లైసెన్స్ ను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు విచారించింది. అనుమతులు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ డీఎం గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. పోకర్, రమ్మీ కోసం గేమింగ్ యూనిట్ ను ఆపరేట్ చేయడానికి అనుమతి కోరింది. ఈ కార్డ్ గేమ్‌లు నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, ఇందులో ఎలాంటి మోసం లేదని సుప్రీం కోర్టు, మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకించింది.
అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగడం, అక్రమంగా జూదం ఆడే అవకాశాలున్నాయంటూ అధికారులు.. పోకర్, రమ్మీ గేమ్స్ యూనిట్ కు అనుమతులు నిరాకరించారని డీఎం గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ శేఖర్ బి సరాఫ్, జస్టిస్ మంజీవే శుక్లాతో కూడిన డివిజన్ బెంచ్ అధికారులు అనుమతులు తిరస్కరించడం సరికాదని పేర్కొంది. అధికారుల వాదన సరిపోదని.. గేమింగ్ దరఖాస్తులను తిరస్కరించే ముందు అధికారులు న్యాయపరమైన పూర్వాపరాలను జాగ్రత్తగా పరిశీలించాలని కోర్టు నొక్కి చెప్పింది.
ఈ అంశంపై సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పులను పరిశీలించిన తర్వాత సంబంధిత అధికారి ఈ అంశాన్ని పరిశీలించాలని భావిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. అధికారులు ఏదో ఊహించుకుని అనుమతులు తిరస్కరించడం సరికాదంది. గేమింగ్ కార్యకలాపాలకు అనుమతులు తిరస్కరించాలంటే అందుకు గట్టి సాక్ష్యాలు కావాలని పేర్కొంది.
అయితే చట్టవిరుద్ధంగా జూదమాడడాన్ని పర్యవేక్షించి చర్యలు తీసుకునే హక్కు అధికారులకు ఉందని హైకోర్టు పేర్కొంది. అధికారులు పిటిషనర్ వాదనలు విని.. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా సహేతుకమైన ఉత్తర్వులు జారీ చేయాలని తీర్పు ఇచ్చింది.