తొక్కిసలాట ఘటన.. బన్నీ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఎప్పుడంటే?
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్స్ సమయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Dec 2024 9:15 AM GMTహైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్స్ సమయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో హీరో అల్లు అర్జున్ ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో బన్నీని పోలీసులు.. చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇంతలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్.. జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్.. డిసెంబర్ 27వ తేదీతో ముగిసింది. దీంతో అదే రోజు బన్నీ.. వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు.
బెయిల్ పిటిషన్ ను స్వీకరించిన నాంపల్లి కోర్టు.. సోమవారానికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు నాంపల్లి న్యాయస్థానం విచారణ చేపట్టింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు, అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫున లాయర్లు.. కోర్టుకు చెప్పారు. అందుకే బన్నీకి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేయాలని కోరారు.
తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడానికి అల్లు అర్జున్ కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు వర్తించవని అభిప్రాయపడ్డారు. బీఎన్ ఎస్ సెక్షన్ 105 బన్నీకి వర్తించదని తెలిపారు. అందుకే బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు అల్లు అర్జున్ న్యాయవాదులు. దీంతో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపారు. ఒక వేళ బెయిల్ ఇస్తే మాత్రం విచారణకు తప్పకుండా సహకరించాలని బన్నీకి ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును వాయిదా వేసింది. జనవరి 3వ తేదీన తుది తీర్పు వెల్లడించనున్నట్లు నాంపల్లి కోర్టు తెలిపింది.
అయితే డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన పోలీసులు వెంటనే అతనికి సీపీఆర్ చేశారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ్ చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇప్పటికే పుష్ప-2 టీమ్ అతడికి రూ.2 కోట్ల పరిహారం అందించింది.