Begin typing your search above and press return to search.

ఏపీ హైకోర్టు ఆర్డర్: చలానాలు కట్టకుంటే సీజ్

నిబంధనలు పాటించకుండా వాహనాల్ని నడిపే వారికి తక్షణమే ఫైన్లు వేయాలని.. అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని స్పష్టం చేసింది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 4:46 AM GMT
ఏపీ హైకోర్టు ఆర్డర్: చలానాలు కట్టకుంటే సీజ్
X

షాకింగ్ ఆదేశాల్ని ఏపీ హైకోర్టు జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న మెసేజ్ ను ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందన్న ఏపీ హైకోర్టు.. రోడ్ల మీద తనిఖీలను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతేకాదు.. నిబంధనలు పాటించకుండా వాహనాల్ని నడిపే వారికి తక్షణమే ఫైన్లు వేయాలని.. అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని స్పష్టం చేసింది.

మోటారు వాహన చట్ట నిబంధనల్ని అమలు చేయకపోవటంతో ప్రమాదాలు జరిగి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ న్యాయవాది తాండవ యోగేశ్ గతంలో హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. దీంతో తాజాగా జరిగిన విచారణకు డీజీపీ ఆఫీసు నుంచి ఐజీ ఆకే రవిక్రష్ణ (లీగల్) హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించింది. అందులోని ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

- సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలి

- జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయట్లేదు?

- నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్ 167 ప్రకారం సీజ్ చేయాలి. సెక్షన్ 206 ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలి.

- హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి మూడు నెలల వ్యవధిలో 667 మంది చనిపోవటం చిన్న విషయం కాదు.

- హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని జూన్ లో ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. 99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాల్ని నడుపుతున్నారు.

- బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలి.

- విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదు. అతిగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు

- ఆటోల్లో పరిమితికి మించి పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళుతున్నారు.

- ఢిల్లీ.. చండీగఢ్ లలో పోలీసులు వాహనాలు తనిఖీ చేసి ఉల్లంఘనలపై వెంటనే జరిమానాలు విధించాలి. ఒకసారి నేను కూడా హైబీమ్ లైట్ వాడిన కారణంగా ఫైన్ చెల్లించా (ఈ విషయాన్ని సీజే జస్టిస్ ఠాకుర్ ప్రస్తావించటం గమనార్హం)

- నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తే రెండు నెలల్లో గణనీయమైన మార్పు వస్తుంది అందుకు మాది హామీని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి విషయంలో మరెంత కఠినంగా వ్యవహరిస్తారో చూడాలి.