16 మంది నిందితులు.. నలుగురి హత్య, 8 మందికి జీవిత ఖైదు ఇదీ పరిటాల కేసు!
ఉమ్మడి ఏపీలో సంచలనం కలిగించిన కేసుల్లో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు ఒకటి.
By: Tupaki Desk | 19 Dec 2024 9:31 AM GMTఉమ్మడి ఏపీలో సంచలనం కలిగించిన కేసుల్లో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్య కేసు ఒకటి. టీడీపీ నాయకుడైన రవీంద్ర ఫ్యాక్షన్ నేపథ్యం, విప్లవ భావజాలం రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ తీసుకువచ్చింది. మాజీ నక్సలైట్ అయిన రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చి ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయారు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ కార్యాలయంలోనే రవీంద్రను దుండగులు అంతమొందించారు. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో 16 మందిపై కేసు నమోదు చేసిన సీబీఐ 8 మందికి జీవిత ఖైదు పడేలా చేయగలిగింది. అయితే కేసు విచారణ దశలోనే ప్రధాన నిందితులు హత్యకు గురికావడంతో అసలు సూత్రధారులు ఎవరో తెలియకుండానే ఈ కేసు ఓ మిస్టరీలా మిగిలిపోయింది.
పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడుగా మద్దెలచెరువు సూరిపై అభియోగాలు మోపారు. రవీంద్ర హత్య సమయానికి సూరి జైల్లో ఉన్నాడు. హైదరాబాద్లో కారు బాంబు కేసుకు సంబంధించిన సూరికి శిక్ష పడగా, ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికి కోసమంటూ సహ నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను ఈ హత్య చేసినట్లు స్వయంగా అంగీకరించాడు. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే రిమాండ్ ఖైదీగా ఉన్న మొద్దు శ్రీను మరో ఖైదీ ఓం ప్రకాశ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇక మొద్దు శ్రీను మర్డర్ తర్వాత బయటకు వచ్చిన మద్దెలచెరువు సూరి కూడా తన అనుచరుడు చేతిలో హతమయ్యాడు. ఇలా సూరి, మొద్దు శ్రీనులతోపాటు మరో కీలక నిందితుడు తగరకుంట చెన్నారెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు.
రవీంద్ర హత్యకేసులో మొత్తం 16 మందిపై అభియోగాలు నమోదు అవ్వగా, ముగ్గురు కేసు విచారణ దశలోనే ప్రాణాలు కోల్పోయారు. నిందితుల్లో నలుగురిపై సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. మరో నిందితుడు అప్రూవర్గా మారడంతో కోర్టు నిర్దోషిగా వదిలేసింది. ఇలా నిర్దోషులుగా విడుదలైన వారిలో మాజీ మావోయిస్టు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. దీంతో పరిటాల హత్యతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం నలుగురు హతమయ్యారు. మిగిలిన 8 మందికి జీవిత ఖైదు పడగా, వారిలో ఐదుగురికి తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిల్లో ఐదుగురు బయటకు రావడంతో పరిటాల హత్య కేసు మరోమారు చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఒక హత్య కేసు.. ఆ తర్వాత మరో నలుగురి మరణానికి కారణమైంది. కేసు విచారణ దశలోనే ఉండటంతో రవీంద్ర హత్యకు సూత్రధారులు ఎవరో తెలియని ఓ మిస్టరీలా మారిపోయింది.