Begin typing your search above and press return to search.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఇష్యూపై ఏపీ హైకోర్టులో ఏం జరిగింది?

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఏపీ అధికార వైసీపీ ధర్మపోరాటాన్ని షురూ చేసింది.

By:  Tupaki Desk   |   31 May 2024 5:12 AM GMT
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఇష్యూపై ఏపీ హైకోర్టులో ఏం జరిగింది?
X

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఏపీ అధికార వైసీపీ ధర్మపోరాటాన్ని షురూ చేసింది. ఇటీవల ఈ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై ఏపీ హైకోర్టును వైసీపీ ఆశ్రయించింది. ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్దంగా దేశంలో మరెక్కడా లేని విధంగా జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించటంతో అందుకు ఓకే చెప్పారు. దీంతో.. లంచ్ మోషన్ రూపంలో నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను చేపట్టారు.

పోస్టల్ బ్యాలెట్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి జారీ చేసిన మెమో టీడీపీకి అనుకూలంగా సడలించినట్లుగా పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకున్నా ఆ పోస్టల్ బ్యాలెట్ ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27న మెమోలు జారీ చేశారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ మెమో.. శాంతిభద్రతల సమస్యగా మారుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఉత్తర్వులను ఏపీలో మాత్రమే అమలు చేస్తున్నట్లుగా వైసీపీ న్యాయవాది తన వాదనల్ని వినిపించారు. సీఈవో మెమోలతో వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరిస్తూ.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని.. పేరు.. హోదా లాంటి వివరాలు చేతితో రాసినా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇందుకు విరుద్దంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే.. దానిని రిజెక్టు చేయొచ్చన్న వాదనలు వినిపించారు. ఇందుకు విరుద్దంగా ఏపీ ఎన్నికల అధికారి (సీఈవో) మెమోలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ తీరును తీవ్రంగా పరిగణించాలని కోరుతూ.. కౌంటింగ్ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే తాము కేసు ఫైల్ చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇంతకూ ఈ నెల 25, 27లో విడుదలైన మెమోలను చూస్తే.. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా.. వెరిఫికేషన్ అవసరం అయినా.. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు.. పేర్లు.. హోదాల వివరాల్ని తీసుకోవాలంటూ ఈ నెల 25న విడుదల చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకున్నట్లుగా చెప్పటంపై వైసీపీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు.. హోదా.. సీలు లేకున్నా ఆ పోస్టల్ బ్యాలెట్ లను ఆమోదించాలంటూ తాజాగా ఆదేశాల్ని జారీ చేయటాన్ని ఏపీ హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు. దీనిపై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మంగళవారం కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో.. పోస్టల్ బ్యాలెట్లపై కోర్టు మాట ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. వచ్చే వారం ఏ రోజున తదుపరి విచారణ జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.