వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్!
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీకి ఆ రాష్ట్ర హైకోర్టు మరో షాకిచ్చింది.
By: Tupaki Desk | 13 Aug 2024 11:27 AM GMTఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీకి ఆ రాష్ట్ర హైకోర్టు మరో షాకిచ్చింది. వైసీపీకి చెందిన అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణికి ఎన్నికల వ్యవహారంలో నోటీసులు జారీ చేసింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆమె అరకు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై గుమ్మా తనూజ రాణి 50 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో తనూజ రాణి ఎన్నికల అఫిడవిట్ లో పలు విషయాలను దాచిపెట్టారని.. పలు విషయాలను పేర్కొనలేదంటూ ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన కొత్తపల్లి గీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. ఎన్నికల అఫిడివిట్ లో తనూజ రాణి తప్పుడు సమాచారం ఇచ్చారని కొత్తపల్లి గీత తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు వైసీపీ ఎంపీ గుమ్మా తనూజ రాణికి నోటీసులు జారీ చేసింది. ఆమెతోపాటు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. గుమ్మ తనూజారాణి ఎన్నికల అఫిడవిట్ లో వాస్తవాలు చెప్పలేదని, దీనిపై తాను రిటర్నింగ్ అధికారిని ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొత్తపల్లి గీత తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని తనూజ రాణికి, అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా అరకు ఎంపీగా తొలిసారి ఎన్నికైన తనూజారాణి దీంతో వివాదంలో కూరుకున్నారు. వైద్యురాలిగా ఉన్న ఆమె చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లోనూ పలు సమస్యలపైన లోక్ సభలో ప్రశ్నలు సంధించి మంచి పేరు తెచ్చుకున్నారు.
కాగా 2014లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత ఆ తర్వాత కొద్ది కాలానికి టీడీపీలో చేరారు. మళ్లీ కొద్ది రోజులకే సొంతంగా జన జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. 2018లో పార్టీని బీజేపీలో విలీనం చేసి అందులో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమెకు సీటు దక్కలేదు. 2024లో అరకు ఎంపీ సీటు దక్కించుకుని బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
2016లో నాడు ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీతపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆమె అసలు ఎస్టీ కాదని.. అయినప్పటికీ దొంగ సర్టిఫికెట్లతో ఎస్టీ నియోజకవర్గమైన అరకు నుంచి పోటీ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వివాదం నుంచి గీత బయటపడ్డారు.