యాపిల్ కు ఒక్క రోజులోనే ఇన్ని లక్షల కోట్ల నష్టం ఎందుకు?
టెక్ ప్రియులకు యాపిల్ కంపెనీ అన్నా, ఆ కంపెనీ ఉత్పత్తులు ఐఫోన్, ఐప్యాడ్, తదితర ఉత్పత్తులు అంటే విపరీతమైన వ్యామోహం.
By: Tupaki Desk | 22 March 2024 10:10 AM GMTటెక్ ప్రియులకు యాపిల్ కంపెనీ అన్నా, ఆ కంపెనీ ఉత్పత్తులు ఐఫోన్, ఐప్యాడ్, తదితర ఉత్పత్తులు అంటే విపరీతమైన వ్యామోహం. భారీ స్థాయిలో రేట్లు ఉన్నా వాటిని దక్కించుకోవడానికి విదేశాలకు కూడా వెళ్లిపోతారు. అక్కడ క్యూల్లో నిలుచుని మరీ కొనుగోళ్లు చేస్తుంటారు. యాపిల్ కొత్త ఉత్పత్తులు విడుదలై.. విడుదల కాగానే వాటిని దక్కించుకోవడానికి ఎగబడుతుంటారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే అతి తక్కువ కాలంలో ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగిన రికార్డును యాపిల్ దక్కించుకుంది. కాగా అలాంటి యాపిల్ కంపెనీ ఒక్కరోజులోనే లక్షల కోట్ల సంపదను పోగొట్టుకుంది.
యాపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో యాపిల్ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని అభియోగాలు మోపింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనమయ్యాయి.
ఈ పరిణామాలతో యాపిల్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాదాపు 4.1 శాతం మేర నష్టాలు సంభవించాయి. దీంతో యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే 113 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9.41 లక్షల కోట్లు) ఆవిరైంది. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ 11 శాతం వరకు కుంగడం గమనార్హం. మూడు ట్రిలియన్ డాలర్ల సంపదతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ నిలిచిన విషయం తెలిసిందే.
యాపిల్ తన ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందని దావాలో అమెరికా ప్రభుత్వం అభియోగాలు మోపింది. తద్వారా ధరలను కృత్రిమంగా పెంచుతోందని ఆరోపించింది. ఫలితంగా నూతన ఆవిష్కరణలకు అవకాశం లేకుండా పోతోందని అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు అమెరికాలోని న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో అమెరికా న్యాయ విభాగం దావా వేసింది. ఇందులో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకం చేయడం గమనార్హం. ఇప్పటికే గూగుల్, మెటా, అమెజాన్ కూడా ఇవే తరహా ఆరోపణలు ఎదుర్కొంటుడటం గమనార్హం. ఇప్పుడు ఈ కంపెనీల కోవలో యాపిల్ కూడా చేరింది. మరోవైపు యూరప్ లోనూ ఈ ఐఫోన్ తయారీ కంపెనీపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు అమెరికా ప్రభుత్వ దావాను యాపిల్ కంపెనీ తోసిపుచ్చింది. అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసింది. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని నెలకొల్పుతోందని మండిపడింది. ప్రజల కోసం రూపొందిస్తున్న సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఆరోపించింది. ఇలాంటి దావాలు యాపిల్ ఉత్పత్తులు మార్కెట్‌లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు తలపెడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని న్యాయస్థానంలోనే సమర్థంగా ఎదుర్కొంటామని తెలిపింది.