Begin typing your search above and press return to search.

లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత వాదనలు ఇవే

సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి జైలు జీవితాన్ని గడుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 May 2024 4:56 AM GMT
లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత వాదనలు ఇవే
X

సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి జైలు జీవితాన్ని గడుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్నారు. బెయిల్ కోసం ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనను అరెస్టు చేసే విషయంలో ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నిబంధనల్ని ఉల్లంఘించినందున బెయిల్ ఇవ్వాలంటూ తాజాగా ఆమె వాదనల్ని ఆమె తరఫు లాయర్లు వినిపించారు. సుప్రీం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తనకు సమన్లు జారీ చేయబోమని.. అడిషనల్ సొలిసిటర్ జనరల్ సర్వోన్నత న్యాయస్థానానికి వాగ్దానం చేసినా.. దాన్ని పక్కన పెట్టేసి అరెస్టు చేయటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేవారు.

తాను కేవలం రాజకీయ నాయకురాలన్న కారణంగా ఈడీ తనను అరెస్టు చేసినట్లుగా పేర్కొన్న కవిత.. రాజకీయ నేతలకు సామాన్యులకు ఉండే హక్కులు ఉండవా? అంటూ ప్రశ్నించటం గమనార్హం. తన బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసందే.

దీనిపై ఆమె తరఫు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. కవితకు ఈడీ తొలుత మార్చి 8, 2023లో సమన్లు జారీ చేసిందని.. అయితే సీబీఐ సీఆర్ పీసీ సెక్షన్ 160 కింద సమన్లు జారీ చేసి.. ఇంటికి వచ్చి విచారించిన నేపథ్యంలో ఈడీ కూడా అలానే చేయాలని తాము కోరినట్లుగా పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని ముఖాముఖిన విచారించాల్సి ఉందని చెప్పి.. ఆఫీసుకు రావాల్సిందేనని చెప్పారని పేర్కొన్నారు.

వారి మాటల్ని నమ్మి తాను మార్చి 11, 2023న ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వస్తే పొద్దుపోయే వరకు తనను కూర్చోబెట్టారని.. ఆ టైంలో వారు తన సెల్ ఫోన్లు అడిగితే ఇచ్చానని.. అందులో ప్రైవసీకి సంబంధించి వివరాలు ఉంటాయని.. ఫోన్ ఓపెన్ చేసే విషయంపై తాను సుప్రీంలో రిట్ పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ కేసు పెండింగ్ లో ఉండగానే తనను విచారణకు హాజరు కావాలని ఒత్తిడి చేయటంతో ఈడీ ముందు రెండోసారి హాజరైనట్లుగా పేర్కొన్నారు.

యాపిల్ కొత్త మోడల్ వస్తే ఫోన్ మార్చుకుంటూ ఉంటానని.. తాను కొత్త ఫోన్ కొన్నప్పుడల్లా పాత వాటిని తన దగ్గర పని చేసే ఉద్యోగులకు ఇస్తూ ఉంటానని.. కానీ.. తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పటానికి తాను గతంలో ఉద్యోగులకు ఇచ్చిన 11 పాత ఫోన్లను సేకరించి ఈడీకి ఇచ్చానని.. అందులో నాలుగు ఫార్మాట్ అయినట్లుగా చెప్పారు. తన ఫోన్ తీసుకున్న ఉద్యోగులు వాటిని ఎందుకు ఫార్మాట్ చేశారో తనకు తెలీదని.. వాటితో తనకు ఎలాంటి సంబంధం ఉంటుందని ప్రశ్నించారు.

సెప్టెంబరు నుంచి మార్చి మధ్యలో ఏమీ జరగకున్నా.. తనను అరెస్టు చేశారని.. దీనికి రాజకీయ నేతలతో కొందరు చేతులు కలిసి ఇలా చేశారని ఆరోపించారు. తనను పార్టీ మార్చటానికే ఇలా చేశారా? అన్న సందేహం కలుగుతుందన్నారు. ఇద్దరు పిల్లల తల్లిగా తన పరిస్థితిని గమనించి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసుకు సంబందించిన ఈడీ తన వాదనల్ని ఈ రోజు (మంగళవారం) వినిపించనుంది. అనంతరం ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తుది నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.