Begin typing your search above and press return to search.

బండికి నంబరు ప్లేట్ లేకుంటే మోసం కేసేంటి? కొట్టేసిన టీహైకోర్టు

చార్మినార్ పోలీసులు నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించిన విచారణలో తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిది.

By:  Tupaki Desk   |   15 Sep 2024 12:30 PM GMT
బండికి నంబరు ప్లేట్ లేకుంటే మోసం కేసేంటి? కొట్టేసిన టీహైకోర్టు
X

చార్మినార్ పోలీసులు నమోదు చేసిన ఒక కేసుకు సంబంధించిన విచారణలో తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిది. చేసిన తప్పునకు.. సంబంధం లేని సెక్షన్ కింద కేసు పెట్టిన వైనాన్ని తప్పు పట్టింది. అంతేకాదు.. దీనిపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. వాహనానికి నంబరు ప్లేట్ లేకుండా వాహనాన్ని నడుపుతున్న వైనంపై హైదరాబాద్ మహానగర పోలీసులు నమోదు చేసిన ‘మోసం’ కేసుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వాహనాలకు పర్మిట్లు జారీ విధానానికి సంబంధించిన సెక్షన్ కింద కేసు నమోదు చేయటాన్ని తప్పు పట్టింది.

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. పోలీసులు వాహనాల తనిఖీల సందర్భంగా వాహనానికి నంబరు ప్లేట్ లేదన్న కారణంగా వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అప్పట్లో ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 80(ఏ) కింద కేసు నమోదు చేశారు. వాహనానికి నంబరు ప్లేట్ లేకపోవటం మోసం ఎందుకు అవుతుందన్న ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తిన పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల కింద పిటిషనర్ నేరానికి పాల్పడలేదని పేర్కొన్నారు. చార్మినార్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను ఏకీభవిస్తూ వాహనానికి నంబరు ప్లేట్ లేకపోవటం మోసం కేసు పరిధిలోకి రాదన్నారు. వాహనాల జారీకి సంబంధించిన సెక్షన్లపై పెట్టిన కేసు చెల్లదంటూ కేసును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది.