అర్థరాత్రి విచారణపై హైకోర్టు ఆగ్రహం.. నిద్రించే హక్కుపై దాడేనని వ్యాఖ్య.. కవితకు సానుకూలం
దేశంలో ప్రతి మనిషికి ఉన్న ప్రాథమిక హక్కుల్లో నిద్రపోవడం కూడా ఒకటని బాంబే హైకోర్టు వ్యాఖ్యానిం చింది.
By: Tupaki Desk | 16 April 2024 8:38 AM GMTదేశంలో ప్రతి మనిషికి ఉన్న ప్రాథమిక హక్కుల్లో నిద్రపోవడం కూడా ఒకటని బాంబే హైకోర్టు వ్యాఖ్యానిం చింది. ఇతర ప్రాథమిక హక్కుల మాదిరి గానే దీనికి కూడా చట్ట పరమైన రక్షణ ఉంటుందని తెలిపింది. నిద్రాభంగం చేస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రాత్రి పూట విచారించడం తగదని తేల్చి చెప్పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. వారికి ఉన్న ప్రాథమిక హక్కులపై దాడి చేయడాన్ని సహించబోమని వెల్లడించింది. ఈ మేరకు ఈడీ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏంటీ కేసు..?
రామ్ ఇస్రానీ అనే 64 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఈడీ అధికారులు గత ఆగస్టులో తమ అదుపులోకి తీసుకున్నారు. ఈయనపై మనీలాండరింగ్ కేసులు నమోదు చేశారు. అయితే..ఈయనను అదే నెల 7వ తేదీన ఒక రాత్రి రాత్రంతా ఈ కేసుకు సంబంధించి ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. దీంతో ఇస్రానీకి నిద్ర కరువైంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. ఇక, ఆ మర్నాడే.. అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇలా తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ.. ఇస్రానీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే.. ఈ అరెస్టును కోర్టు వ్యతిరేకించలేదు. అరెస్టు చేయడాన్ని కూడా సమర్థించింది. అయితే.. ఇదేసమయంలో పిటిషనర్‌లేవనెత్తిన అంశాన్ని మాత్రం తీవ్రంగా పరిగణించింది. ఒక రాత్రి రాత్రంగా విచారించడం.. పిటిషనర్‌కు నిద్రలేకుండా చేయడాన్ని మాత్రం తప్పుబట్టింది. నిద్ర అనేది కూడా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమేనని పేర్కొంది. దీనిని హరించేందుకు ఎవరికీ హక్కులేదని పేర్కొంది. ఇస్రానీ అంగీకారంతోనే తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించామని ఈడీచెప్పినా.. కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
వ్యక్తి జీవించే హక్కులో నిద్ర కూడా ఇమిడి ఉంటుందనిపేర్కొంది. నిద్రను అందించడం అనేదికూడా హక్కేనని తెలిపింది. ఎన్నిఆరోపణలు ఉన్నా.. సదరు వ్యక్తిని ఉదయం వేళల్లోమాత్రమే విచారించాలని.. బాంబే కోర్టు తేల్చి చెప్పింది.
కవితకు సానుకూలం!
ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. తీహార్ జైల్లో ఉన్న కవిత కూడా ఇదే వాదనను తాజాగా తెరమీదకు తెచ్చారు. విచారణ పేరుతో తనను జైలు గదిలో ప్రశాంతంగా ఉండనివ్వడంలేదని.. నిద్ర కూడా పోనివ్వడం లేదని ఆమె మీడియా ముందు ఆరోపించారు. తాజా తీర్పుతో ఆమెకు ఉపశమనం లభించే అవకాశంకనిపిస్తోంది. ఆమె కనుక బాంబే హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. తనకు కూడాన్యాయం చేయాలని కోరితే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని పరిశీలకులు చెబుతున్నారు.