ఎట్టకేలకు జైలుకు వచ్చి లొంగిపోయిన బోరుగడ్డ
బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ పొందిన ఆయనకు కోర్టు విధించిన గడువు నిన్న ముగిసింది.
By: Tupaki Desk | 12 March 2025 11:35 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై, మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన వైసీపీ నేత, బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు లొంగిపోయాడు.
బోరుగడ్డ అనిల్ రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో లొంగిపోయారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ పొందిన ఆయనకు కోర్టు విధించిన గడువు నిన్న ముగిసింది. దీంతో అతను లొంగుతాడా లేదా అనే ఉత్కంఠకు తెరపడింది.
తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించి బెయిల్ పొడిగించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైకోర్టు స్పష్టంగా మధ్యంతర బెయిల్ పొడిగించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. గతంలోనే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రాజమహేంద్రవరం జైలులో లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, బోరుగడ్డ అనిల్ బుధవారం జైలులో లొంగిపోయారు.
టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన అనంతరం కోర్టు రిమాండ్ విధించగా, తన తల్లి అనారోగ్యాన్ని పురస్కరించుకుని మధ్యంతర బెయిల్ పొందాడు. అయితే, ఈ బెయిల్ కోసం నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు.
ఈ నెల 1వ తేదీన నకిలీ పత్రాలతో మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న అనిల్, మరోసారి పొడిగించుకునేందుకు చేసిన ప్రయత్నం కోర్టులో విఫలమైంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ పొడిగించడానికి వీలులేదని తేల్చి చెప్పడంతో, చివరికి అతను రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయాడు.