Begin typing your search above and press return to search.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు.. స్పీకర్‌కు కీలక ఆదేశాలు

ఎన్నికల వేళ కండువాల మార్పు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు ముగిశాక ఏ ప్రభుత్వం కొలువుదీరుతుందో.. అందులోకి వలసలు కూడా కామన్.

By:  Tupaki Desk   |   9 Sep 2024 7:41 AM GMT
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు.. స్పీకర్‌కు కీలక ఆదేశాలు
X

ఎన్నికల వేళ కండువాల మార్పు సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు ముగిశాక ఏ ప్రభుత్వం కొలువుదీరుతుందో.. అందులోకి వలసలు కూడా కామన్. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతూనే ఉంటారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలించింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి పెద్దగా వలసలు కొనసాగలేదు. ఆ పార్టీలోకే ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరారు.

అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లతో పాటు కింది స్థాయి నాయకత్వం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ బీ ఫామ్‌తో గెలిచిన ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్‌లు న్యాయపోరాటానికి దిగారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కౌశిక్, వివేకాలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ విషయంపై స్పీకర్‌ను కలిసినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందులో వెల్లడించారు. దాంతో విచారణ చేపట్టిన హైకోర్టులో సుదీర్ఘ వాదనల తరువాత ఈరోజు ఫైనల్ తీర్పును వెలువరించింది. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది.